Jio Hotstar Free Access | ఐపీఎల్ 2025 సందర్భంగా టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు 90 రోజుల పాటు ఉచితంగా క్రికెట్‌ను వీక్షించేందుకు ఓ నూతన ప్లాన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31, 2025 వరకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కు వచ్చిన స్పందనను చూసి దీన్ని మరికొద్ది రోజుల పాటు పొడిగించినట్లు జియో తెలియజేసింది. అందులో భాగంగానే ఏప్రిల్ 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. కొత్తగా జియో సిమ్ తీసుకునే వారు రూ.299 లేదా ఆపైన విలువ గల రీచార్జి ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే 90 రోజుల పాటు జియో హాట్ స్టార్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.
ఈ ఆఫర్లో బాగంగా యూజర్లు టీవీలో, ఫోన్లో 4కె రిజల్యూషన్‌లో వీడియోలు, మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31 వరకే ఉండగా దీన్ని ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఉన్న కస్టమర్లు మార్చి 17 వరకు ఏదైనా ప్లాన్‌ను రీచార్జి చేసుకుని ఉంటే వారు రూ.100 చెల్లించి యాడాన్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇటీవలే లాంచ్ చేశారు. దీంతోనూ జియో హాట్ స్టార్‌ను 90 రోజుల పాటు వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 5జీబీ ఉచిత డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ అందించబడవు.
ఇక రూ.195కి జియో క్రికెట్ ప్యాక్ సైతం అందుబాటులో ఉంది. దీన్ని రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 15 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీంతోపాటు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ను 90 రోజుల వరకు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే రూ.949 ప్లాన్ కూడా అందుబాలో ఉంది. దీని ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ 4జి డేటాను పొందవచ్చు. అన్లిమిటెడ్ 5జి డేటాను అందిస్తారు. ఈ ప్లాన్‌లో ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. 84 రోజుల పాటు జియో హాట్ స్టార్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఇలా క్రికెట్ ప్రేమికులు జియోలో ఆయా ప్లాన్ల ద్వారా ఉచితంగా ఐపీఎల్‌ను వీక్షించే వెసులుబాటును కల్పిస్తున్నారు.
జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్‌ను కొత్తగా తీసుకున్న వారు కూడా 50 రోజుల పాటు ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ను పొందవచ్చు. అలాగే పలు యాప్స్‌కు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. జియో ప్లస్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను వాడేవారు కూడా జియో హాట్ స్టార్‌ను తమ మొబైల్ డివైస్‌లపై 90 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. జియో ప్రీపెయిడ్ వినియోగదారులు అదనపు డేటా కోసం డేటా యాడాన్ ప్యాక్‌లను కూడా ట్రై చేయవచ్చు. రూ.219తో 30జీబీ, రూ.289తో 40జీబీ, రూ.359తో 50జీబీ డేటాను పొందవచ్చు. ఈ డేటా ప్యాక్‌లు 30 రోజుల పాటు వాలిడిటీలో ఉంటాయి. అదనపు డేటా ప్యాక్‌ల ద్వారా కస్టమర్లు డేటా అయిపోతుందని చింతించాల్సిన పనిలేదు. అయితే 5జి వస్తున్న ప్రాంతాల్లో అన్లిమిటెడ్ 5జి సదుపాయం లభిస్తుంటే కస్టమర్లు ఆ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలి. దీంతో ప్యాక్ లో ఉన్న డేటా అయిపోకుండా ఉంటుంది.