HMD 100 |మొబైల్స్ తయారీదారు హెచ్ఎండీ మరో రెండు 2జీ ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. హెచ్ఎండీ 100, హెచ్ఎండీ 101 పేరిట ఈ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ రెండు ఫోన్లలోనూ 1.77 ఇంచుల డిస్ప్లే ఉండగా, ప్రతి రోజూ చాలా సులభంగా ఉపయోగించుకునే వినియోగదారులకు గాను ఈ ఫోన్లను రూపొందించినట్లు హెచ్ఎండీ తెలియజేసింది. హెచ్ఎండీ 100 ఫీచర్ ఫోన్‌ను చాలా మినిమలిస్టిక్ డిజైన్‌తో రూపొందించారు. ఇది దృఢమైన ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. దీన్ని రోజువారి అవసరాలకు చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 800 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. ఏకంగా 7 రోజుల వరకు స్టాండ్ బై టైమ్‌ను అందిస్తుంది.
హెచ్ఎండీ 100 ఫోన్‌ను ఉపయోగించి 6 గంటల వరకు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు. అయినప్పటికీ బ్యాటరీ బ్యాకప్ ఇంకా మిగిలి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ద్వారా కాల్స్, టెక్ట్స్, వైర్ లెస్ ఎఫ్ఎం రేడియో, టార్చ్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఫీచర్లను చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇక హెచ్ఎండీ 101 ఫోన్‌ను పూర్తిగా స్లీక్ డిజైన్‌తో రూపించారు. దీనికి మోడ్రన్ ఫినిషింగ్‌ను ఇచ్చారు. కీప్యాడ్ పెద్దగా ఉంటుంది. దీని వల్ల టెక్ట్స్‌ను సులభంగా టైప్ చేయవచ్చు. ఇందులో పలు ఎంటర్టైన్మెంట్ ఫీచర్లను అందిస్తున్నారు. ఎంపీ3 ప్లేయర్ ఉంది. వైర్ లెస్ ఎఫ్ఎం రేడియో, మైక్రో ఎస్డీ కార్డుకు సపోర్ట్, స్నేక్ గేమ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 1000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. అందువల్ల 9 రోజుల వరకు స్టాండ్ బై టైమ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ద్వారా ఫోన్లో 7 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడుకోవచ్చు.
ఈ రెండు ఫోన్లు సమాన కొలతలు, బరువును కలిగి ఉన్నాయి. కేవలం 73 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. కనుక సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ ఫోన్లలో యూనిసోక్ 6533 జి ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఎస్30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీ 100 ఫోన్లో 4ఎంబీ ర్యామ్ ఉండగా, హెచ్ఎండీ 101 ఫోన్లో 8ఎంబీ ర్యామ్‌ను ఇచ్చారు. ఇక ఈ రెండింటిలోనూ 4ఎంబీ స్టోరేజ్ లభిస్తుంది. అయితే హెచ్ఎండీ 101లో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 32జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు కేవలం 2జి నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. మైక్రో యూఎస్బీ పోర్టు లభిస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.
హెచ్ఎండీ 100 ఫోన్‌కు చెందిన గ్రే కలర్ మోడల్ ధర రూ.1099 ఉండగా డిస్కౌంట్‌తో రూ.949కి అందిస్తున్నారు. అలాగే ఇదే ఫోన్ కు చెందిన రెడ్ కలర్ మోడల్ ధర రూ.1149 ఉండగా, దీన్ని రూ.999 ధరకు అందిస్తున్నారు. ఇక హెచ్ఎండీ 101 ఫోన్‌ను గ్రే, బ్లూ కలర్లలో లాంచ్ చేయగా ఈ ఫోన్ ధర రూ.1199గా ఉంది. డిస్కౌంట్ పోను దీన్ని రూ.1049 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లను హెచ్ఎండీ ఆన్లైన్ స్టోర్‌తోపాటు అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్స్, ఇతర ఈ-కామర్స్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు.