వాషింగ్టన్: సౌర కుటుంబంలోనే అతిపెద్దదైన గురు గ్రహం మన ఖగోళ శాస్త్రవేత్తలను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. అలాంటిదే ఆ గ్రహంపై ఉన్న గ్రేట్ రెడ్‌స్పాట్. 150 ఏళ్లుగా ఆ గ్రహాన్ని అతలాకుతలం చేస్తున్న పెను తుఫాను ఇది. దీని పరిధి, గాలుల వేగం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రేట్ రెడ్స్పాట్కు సంబంధించిన ఫొటో తీసింది.
ఏంటీ గ్రేట్ రెడ్‌స్పాట్?
ఇదొక పెను తుఫాను. జూపిటర్‌పై 150 ఏళ్లుగా దీనిని మన శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ప్రతిసారీ దీని పరిధి పెరుగుతూ ఉన్నట్లు తాజాగా తేలింది. గ్రేట్ రెడ్ స్పాట్‌లోని బయటి వైపు ఉన్న గాలుల వేగం పెరుగుతోంది. 2009 నుంచి 2020 వచ్చేలోపు ఈ గాలుల వేగం 8 శాతం పెరిగినట్లు గుర్తించారు. గంటకు 640 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అంతేకాదు ఈ తుఫాను సుడి గుండమే మన భూమి కంటే పెద్దదంటే ఇది ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మొదట దీనిని చూసినప్పుడు అసలు ఇలాంటిది సాధ్యమేనా అని అనిపించిందని, అయితే హబుల్ టెలిస్కోపు స్పష్టంగా తీసి పంపిన ఫొటో చూసిన తర్వాత దీనిపై స్పష్టమైన అంచనాకు వచ్చినట్లు ఈ విశ్లేషణ చేసిన బృందానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ మైకేల్ వాంగ్ చెప్పారు.
తుఫానుల కింగ్
ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌కు మన సౌర కుటుంబంలో తుఫానుల కింగ్‌గా పేరుంది. ఈ మధ్య జునో స్పేస్‌క్రాఫ్ట్ దగ్గరగా వెళ్లిన సమయంలో ఈ తుఫాను గురు గ్రహం వాతావరణంలో 320 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించినట్లు గుర్తించారు. భూమిపై వచ్చే సగటు భారీ తుఫాన్ల పరిధి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. దీనిని బట్టే ఇది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. వందేళ్లుగా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌ను పరిశీలిస్తున్నారు. ఈ తుఫాను వ్యాసం 16 వేల కిలోమీటర్లు. అంటే మన భూమి ఇందులో సులువుగా ఇమిడిపోతుంది. భూమి వ్యాసం 12700 కిలోమీటర్లు మాత్రమే.