Google Pixel 10 | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ పలు నూతన స్మార్ట్ ఫోన్లను పిక్సల్ 10 సిరీస్‌లో లాంచ్ చేసింది. పిక్సల్ 10, పిక్సల్ 10 ప్రొ, పిక్సల్ 10 ప్రొ ఎక్స్ఎల్ పేరిట ఈ ఫోన్లను లాంచ్ చేసింది. ఇవే ఫోన్లను భారత్‌లోనూ గూగుల్ లాంచ్ చేసింది. పిక్సల్ 10 స్మార్ట్ ఫోన్లో 6.3 ఇంచుల ఓలెడ్ యాక్చువా డిస్ప్లే ఉండగా, దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. సూర్యకాంతిలోనూ డిస్ప్లేను స్పష్టంగా వీక్షించేలా 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. పిక్సల్ 10 ప్రొలో 6.3 ఇంచుల 1.5కె రిజల్యూషన్ కలిగిన 120 హెడ్జ్ డిస్ప్లేను ఇచ్చారు. పిక్సల్ 10 ప్రొ ఎక్స్ఎల్ ఫోన్లో 6.7 ఇంచుల క్వాడ్ హెచ్డీఈ ప్లస్ 120 హెడ్జ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. వీటికి వరుసగా 3300 నిట్స్, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్లలో గూగుల్ టెన్సార్ జి5 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ కూడా లభిస్తుంది. గత పిక్సల్ సిరీస్ ఫోన్ల కన్నా ఈ ఫోన్లు 60 శాతం వేగంగా ఏఐ ఫీచర్లను అందిస్తాయని, 34 శాతం వేగంగా పనిచేస్తాయని గూగుల్ చెబుతోంది. పిక్సల్ 10 ప్రొ సిరీస్ ఫోన్లలో ప్రత్యేకంగా వేపర్ చాంబర్ కూలింగ్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్లను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురికావు. ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వీటికి గాను 7 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను అందిస్తామని గూగుల్ చెబుతోంది. అమెరికా యూజర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్లలో శాటిలైట్ ఎస్‌వోఎస్ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. పిక్సల్ 10 ఫోన్లకు గాను డిస్ప్లేలకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. పిక్సల్ 10 సిరీస్ ఫోన్‌ను 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. పిక్సల్ 10 ప్రొ ఫోన్లు 16జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.
ఈ ఫోన్లలో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. పిక్సల్ 10 ఫోన్లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10.8 మెగాపిక్సల్ 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, 10.5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే పిక్సల్ 10 ప్రొ ఫోన్లలో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 48 మెగాపిక్సల్ 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, 42 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. అనేక ఏఐ ఫీచర్లను సైతం ఈ కెమెరాతో అందిస్తున్నారు. ఇక అన్ని ఫోన్లలోనూ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండగా, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. 5జి సేవలను అన్ని ఫోన్లలోనూ పొందవచ్చు. పిక్సల్ 10 ఫోన్ లో వైఫై 6 ఫీచర్ ఉండగా, పిక్సల్ 10 ప్రొ ఫోన్లలో వైఫై 7 ఫీచర్‌ను అందిస్తున్నారు. అన్ని ఫోన్లలోనూ బ్లూటూత్ 6 ఎల్ఈని అందిస్తున్నారు. అలాగే యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Pixel 10 Pro And Xl
పిక్సల్ 10 ఫోన్లో 4970 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా దీనికి 29 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే పిక్సల్ 10 ప్రొ ఫోన్లో 4870ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, పిక్సల్ 10 ప్రొ ఎక్స్ఎల్ ఫోన్లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పిక్సల్ 10 ప్రొ ఫోన్‌కు 29 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్ లభిస్తుంది. అలాగే పిక్సల్ 10ప్రొ ఎక్స్ఎల్ ఫోన్‌కు 39 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 25 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది. పిక్సల్ 10 ఫోన్‌ను ఆబ్సిడియన్, ఫ్రాస్ట్, లెమన్ గ్రాస్, ఇండిగో కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ప్రొ ఫోన్లను ఆబ్సిడియన్, పోర్సిలియన్, మూన్ స్టోన్, జేడ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు.
గూగుల్ పిక్సల్ 10 ఫోన్‌కు చెందిన ప్రారంభ ధర రూ.79,999 ఉండగా, పిక్సల్ 10 ప్రొ ఫోన్‌కు చెందిన ప్రారంభ ధర రూ.1,09,999గా ఉంది. అలాగే పిక్సల్ 10 ప్రొ ఎక్స్ఎల్ ఫోన్ ప్రారంభ ధరను రూ.1,24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లకు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించారు. వీలైనంత త్వరగా అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్లను గూగుల్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా ఆఫర్లను సైతం అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్‌తో పిక్సల్ 10 ఫోన్‌పై రూ.7వేలు, పిక్సల్ 10 ప్రొ, పిక్సల్ 10 ప్రొ ఎక్స్ఎల్ ఫోన్లపై రూ.10వేల ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. రూ.5వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నారు.