Google-Bing | సెర్చింజన్ గూగుల్ (Google)కు మైక్రోసాఫ్ట్ (Microsoft) సెర్చింజన్ బింగ్ (Bing) నుంచి ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన ఎలక్ట్రానిక్ వస్తువుల్లో అల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌కు బదులు మైక్రోసాఫ్ట్ బింగ్‌ను డిఫాల్ట్ సెర్చింజన్‌గా పెట్టనున్నదని న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇదే జరిగితే గూగుల్ (Google) సుమారు 300 కోట్ల డాలర్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని ఆ సంస్థ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో లీడింగ్ స్థానంలో కొనసాగుతున్న శాంసంగ్.. తన ప్రాధాన్యాలను మార్చుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో సెర్చింజన్ గూగుల్‌కు ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ (ChatGPT) టూల్ నుంచి గట్టి పోటీ వస్తున్నది. చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్ ‘బింగ్’తో జత చేసిన తర్వాత ఆ పోటీ మరింత తీవ్రమైంది. గత నవంబర్‌లో వెలుగులోకి వచ్చిన చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ స్టార్టప్ సంస్థలో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. గూగుల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ సెర్చింజన్ ‘బింగ్’ను చాట్‌జీపీటీకి జత చేసింది.
ఐడీసీ డేటా ప్రకారం శాంసంగ్ గతేడాది 26.1 కోట్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించింది. ఈ ఫోన్లన్నీ గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తున్నాయి. అయితే, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లతో సుదీర్ఘకాలంగా శాంసంగ్ భాగస్వామ్య ఒప్పందాలు కలిగి ఉన్నది.
మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్‌తోపాటు రెండు సంస్థల యాప్స్, సర్వీసులను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నది శాంసంగ్. గూగుల్‌ను డిఫాల్ట్‌గా తొలగించి మైక్రోసాఫ్ట్ బింగ్‌ను తీసుకొచ్చే విషయమై శాంసంగ్ ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రెండు సంస్థలతో సంప్రదిస్తున్న శాంసంగ్.. ఇప్పటికైతే గూగుల్‌ను డిఫాల్ట్‌గా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు, గూగుల్ సైతం తన మార్కెట్‌ను కాపాడుకునేందుకు పలు సెర్చింజన్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నది. పలు ప్రాజెక్టుల అప్డేటింగ్పైనే దృష్టి సారించింది. ఇప్పటికే `మాగీ` అనే పేరుతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు తేవడంపై గూగుల్ ఫోకస్ చేస్తున్నది. ఈ ప్రాజెక్టుపై 160 మందికి పైగా నిపుణులు పని చేస్తున్నారు.