అంటార్కిటికా అంటే అందమైన మంచుకొండలే గుర్తుకొస్తాయి. కానీ ఆ అందంచాటునే ముప్పుకూడా ఉందని పరిశోధకులు గుర్తించారు. అంటార్కిటిక్ హిమానీనదాలు గత 5,500 సంవత్సరాల్లోనే అత్యంత వేగంగా మంచును కోల్పోతున్నాయని తేల్చారు. మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, దీంతో మానవాళికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మైనే విశ్వవిద్యాలయం, బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే శాస్త్రవేత్తలు అంటార్కిటికాలోని త్వైట్స్, పైన్ ఐలాండ్ హిమానీనదాల పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టంలో మార్పుల రేటును కొలిచారు. త్వైట్స్, పైన్ ఐలాండ్ హిమానీనదాలు 192,000 కిమీ², 162,300 కిమీ² విస్తీర్ణంలో ఉండేవి. ఇప్పుడు, 5,500 సంవత్సరాల్లోనే చూడని స్థాయిలో మంచు నష్టం జరిగిందని పరిశోధకులు తేల్చారు. అంటార్కిటికాలో ఈ హిమానీనదాలు కరిగితే ప్రపంచ సముద్ర మట్టాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం వల్ల ప్రపంచ సముద్రాల మట్లం 3.4 మీటర్ల మేర పెరుగుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే సముద్రాలు పొంగి చుట్టుపక్కల ఉన్న నగరాలను ముంచేస్తాయని అంటున్నారు. ఈ అధ్యయన వివరాలు ‘నేచర్ జియోసైన్స్’లో ప్రచురితమయ్యాయి.