Deep Fakes | సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ.. ఊహించని ప్రమాదాలు పలకరిస్తున్నాయి. అధునాతన అస్ర్తాలు చేతికి అందేకొద్దీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కృత్రిమ మేధను ఉపయోగిస్తూ వికృత కార్యాలకు పాల్పడుతున్నారు. అసలుకు, నకిలీకి తేడా తెలియనంతగా ఫొటోలను మారుస్తున్నారు. వీడియోలనూ రూపొందిస్తున్నారు. చివరికి గొంతుకనూ ఏమారుస్తున్నారు. ‘డీప్‌ఫేక్’గా పిలిచే ఈ తరహా మోసాలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగాయి.
తరచి చూస్తే ‘డీప్‌ఫేక్’ గాథలు మన పురాణాల్లోనూ కనిపిస్తాయి. ఇంద్రుడు తన మంత్రశక్తితో గౌతముడి రూపాన్ని పొందడం, అహల్యను ఏమార్చడం ఈ కోవకే చెందుతుంది. పురాణాలు పక్కనపెడితే, సృష్టికి ప్రతిసృష్టి చేసేంత శక్తిని సంతరించుకుంటున్న కృత్రిమ మేధ నుంచి పుట్టుకొచ్చిన డీప్‌ఫేక్ అహల్య కథలో దేవేంద్రుడి పాత్రలా నెట్టింట విధ్వంసాలకు కారణమవుతున్నది. అసలును నకిలీగా మార్చేసి అసలుకే ఎసరు తెస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అసభ్యంగా మార్చేసి ఆ వ్యక్తుల పరువును డీప్‌ఫేక్ మాయాజాలంతో బజారుకీడుస్తున్నారు సైబర్ మాయగాళ్లు. నిండుదుస్తుల్లో దిగిన ఫొటోను సైతం నగ్నంగా మార్చేస్తున్నారు. పాతికేండ్ల మనిషిని అరవై ఏండ్లవాడిగా చూపిస్తున్నారు. సాధారణ వీడియోను సైతం అసభ్యంగా మార్చి, దాన్ని ఆధారంగా చేసుకొని ఊహించని ప్రమాదంలోకి నెడుతున్నారు.
☞ ‘డీప్‌ఫేక్’ వలలో చిక్కినవారిని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టరు స్కామర్లు. ఒక ప్రొఫైల్‌ను వాడుకొని, అతని స్నేహితులకు ఆ వ్యక్తి పంపినట్టుగా సందేశాలు పంపుతుంటారు. అత్యవసరంగా డబ్బులు కావాలని అడుగుతారు. ఏదో ప్రమాదంలో ఉన్నానని, డబ్బులు పోయాయనీ ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు. అయితే, వ్యక్తిగతంగా అతనికి ఫోన్ చేస్తే గానీ, అలా అడిగింది అసలు వ్యక్తో, నకిలీ వ్యక్తో తెలియదు. కొన్ని ఏఐ టూల్స్ ఉపయోగించి అయినవారి నుంచి వచ్చినట్టుగా ఇ-మెయిల్ పంపుతుంటారు. అధికారిక వెబ్సైట్లు, మన పై అధికారి నుంచి అత్యవసర సందేశాలు, మెయిల్స్ కూడా పంపుతుంటారు. వీటిని నిజమని నమ్మితే బోల్తాపడ్డట్టే! ఈ మాయగాళ్ల ఒత్తిళ్లకు తలొగ్గిన వ్యక్తిని ఎరగా చేసుకొని భారీ కుట్రలకు పాల్పడతారు. కృత్రిమ మేధ సాయంతో అధికారిక పత్రాలు కాజేస్తారు. హైటెక్ మాల్వేర్ రూపొందించి మన సాంకేతిక వలయాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తారు. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, సామాజిక మాధ్యమాల్లోని సమాచారమంతా మొత్తం దొంగిలిస్తారు. వ్యక్తుల ముఖాలను మాత్రమే కాదు, గొంతుకనూ ఏమార్చి డిజిటల్ దునియాలో ప్రకంపనలు సృష్టిస్తుంటారు ఫ్రాడ్స్టర్లు.
బిహేవియరల్ బయోమెట్రిక్స్: ఏదైనా నమ్మదగని కార్యకలాపాలు జరిగినప్పుడు కృత్రిమ మేధ సాయంతో గుర్తించవచ్చు. కీ స్ట్రోక్స్, నేవిగేషన్ ప్యాటర్న్, మొబైల్ కదలికలు, వీడియోలో వింటున్న మాటలకు, పెదాల
కదలిక మధ్య వ్యత్యాసాన్ని ఏఐతో గమనించవచ్చు.
మాల్వేర్ డిటెక్షన్: మాల్వేర్ ప్రమాదాలను గుర్తించడంలోనూ ఏఐ సాయపడుతుంది. మొత్తం డేటాను విశ్లేషించి అందులో పొంచి ఉన్న సమస్యలను తెలియజేస్తుంది.
థ్రెట్ డిటెక్షన్: భారీ డేటాను, అల్గారిథమ్స్‌ను విశ్లేషించడంలో ఏఐ ఉపయోగపడుతుంది. నెట్వర్క్ ట్రాఫిక్ లాగ్, సిస్టమ్ లాగ్, వినియోగదారుడి ప్రవర్తన, డిజిటల్ ప్రమాదాలనూ కూడా ముందుగానే హెచ్చరించి సమాచారం అందిస్తుంది.
ప్రిడిక్టివ్ అనాలసిస్: సమాచార విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టికల్ మాడల్స్, ఏఐ వీటిని ఉపయోగించి భవిష్యత్ పర్యవసనాలను అంచనావేయవచ్చు.
నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ): దీని ద్వారా ఫిషింగ్ ఇ-మెయిల్స్‌ను గుర్తించవచ్చు. ఇ-మెయిల్ స్పూఫింగ్ను నిరోధించడానికి SPF, DKIM, DMARC తదితర ప్రోటోకాల్స్‌ను వాడొచ్చు
కోడ్‌వర్డ్: కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితుల మధ్య ఏదైనా అంకెను గానీ, పదాన్ని గానీ కోడ్‌గా పెట్టుకోవాలి. మీకు వచ్చిన సందేశాలు, వీడియోలు, వీడియోకాల్స్ డీప్‌ఫేక్ అన్న అనుమానం కలిగినప్పుడు ఇలాంటి కోడ్ వర్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రశ్నించు: డీప్‌ఫేక్ ముసుగు వేసుకున్న వారిని గుర్తించడం అంత తేలిక కాదు! వారి ప్రతి మాటకూ ఊఁ కొట్టకుండా.. ఎదురు ప్రశ్నించడం మంచిది. వాటికి తప్పుడు సమాధానాలు చెబితే ఆ వ్యక్తి ఫ్రాడ్ అని ఇట్టే తేలిపోతుంది.
2ఎఫ్ఏ: సామాజిక మాధ్యమాలు, ఇ-మెయిల్ ఖాతాలను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా సైబర్ దాడి నుంచి రక్షణ దొరుకుతుంది. కఠినమైన పాస్వర్డ్ పెట్టడం వల్ల దానిని ఛేదించడం కూడా ఫేక్‌గాళ్లకు కష్టతరం అవుతుంది.
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో: వీడియోకాల్స్ చేసినప్పుడు ముఖం పక్కకు తిప్పమని అడగండి. చేతులు ఆడించమని చెప్పండి. డీప్‌ఫేక్ స్కామర్ అయినట్టయితే మీరు కోరిన విన్యాసాలు చేయలేక దొరికిపోతాడు. డీప్‌ఫేక్ నేరగాళ్ల బారినపడితే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి కైంప్లెంట్ చేయొచ్చు.
☞ వేధింపులకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చడం కొందరి లక్ష్యంగా ఉంటుంది.
☞ డబ్బుల కోసం ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్లుంటారు.
☞ నేర పరిశోధనల్లో సాక్ష్యాలను తారుమారు చేయడానికి డీప్‌ఫేక్ ప్రయోగిస్తారు.
☞ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ సాంకేతికతను నమ్ముకుంటున్నారు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”