Elon Musk | సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ న్యూ బాస్ ఎలన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఆయన వ్యక్తిగత సంపద సుమారు 100.5 బిలియన్ డాలర్లు హరించుకుపోయిందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అయినా, 169.9 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడిగా కొనసాగుతున్నారని తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ కార్ల సంస్థ టెస్లా షేర్లే ఎలన్ మస్క్‌కు ప్రధాన ఆదాయ వనరు. ఇటీవల టెస్లా షేర్లు రెండేండ్ల కనిష్ఠ స్థాయికి పతనం అయ్యాయి. దీంతో ఎలన్ మస్క్ భారీగా నష్టపోయారని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే, ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ఇప్పటికి 19 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా స్టాక్స్ మస్క్ అమ్మేయడం వల్ల కూడా ఆయన వ్యక్తిగత సంపద తరిగి పోతున్నట్లు సమాచారం.
గతేడాది నవంబర్ నెలలో బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం ఎలన్‌మస్క్ వ్యక్తిగత నికర సంపద 340 బిలియన్ డాలర్లు. కానీ టెస్లా షేర్లు పతనం కావడంతో ఆయన సంపద 170 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
టెస్లాలో ఎలన్ మస్క్ కు 15 శాతం వాటా ఉంది. ఇప్పటి వరకు టెస్లా షేర్లు 58 శాతం పతనం అయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఆయన 860 కోట్ల డాలర్ల సంపద నష్టపోయారు.
టెస్లా కంపెనీకి అమెరికా తర్వాత చైనా అతిపెద్ద బిజినెస్ వస్తున్నది. కానీ, చైనా సర్కార్ అమలు చేస్తున్న జీరో కొవిడ్ పాలసీతో ఎలన్‌మస్క్- టెస్లా కార్ల బిజినెస్ మీద ప్రతికూల ప్రభావం పడుతున్నది. వివిధ కారణాల వల్ల చైనా నుంచి మూడు లక్షలకు పైగా కార్లను రీకాల్ చేయడం కూడా సంస్థ షేర్ల పతనానికి మరో కారణంగా కనిపిస్తున్నది.
దీనికితోడు ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఎలన్‌మస్క్ పూర్తిగా దాని భవితవ్యంపైనే కేంద్రీకరించారు. దీని ప్రభావం టెస్లా బిజినెస్ మీద పడుతుందని ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.