ఫోన్ కొట్టేసినవాళ్లు ఆ డిజిటల్ పేమెంట్ యాప్స్‌ను ఉపయోగించి బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు కొట్టేస్తే దిక్కేంటి? అందుకే మొబైల్ పోయిన వెంటనే ఆ పేమెంట్ యాప్స్ అన్నింటినీ బ్లాక్ చేయడం మంచిది. ఫోనే పోయినప్పుడు వాటిని ఎలా బ్లాక్ చేయాలని సందేహిస్తున్నారా? దానికి ఓ ప్రాసెస్ ఉంది.
ఒకప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడేందుకు మాత్రమే ఫోన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అన్నింటికీ మొబైల్స్‌నే. ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలకు కూడా ఫోన్లనే వాడుతున్నారు. రకరకాల యూపీఐ పేమెంట్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని పేమెంట్స్ చేస్తున్నారు. మరి అలాంటి మొబైల్ పోతే పరిస్థితేంటి?
ముందుగా గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటే.. వేరే ఏ నంబర్ నుంచి అయినా సరే 1800 419 0157 నంబర్‌కు కాల్ చేయాలి. ఐవీఆర్ ద్వారా కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడేందుకు ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేస్తే అకౌంట్ బ్లాక్ చేస్తారు.
పేటీఎం అకౌంట్ బ్లాక్ చేయాలంటే 0120 4456456 నంబర్‌కు కాల్ చేసి రిపోర్ట్ లాస్ట్ ఆర్ అన్‌అథరైజ్‌డ్ యూసేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం లాస్ట్ ఫోన్ ఆప్షన్ ఎంచుకుని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు పేటీఎం అకౌంట్ బ్లాక్ అవుతుంది. పేటీఎం వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం ద్వారా కూడా వివరాలు ఎంటర్ చేసి బ్లాక్ చేయొచ్చు.
ఫోన్ పే అకౌంట్ బ్లాక్ చేయడం కోసం 080 68727374/022 68727374 నంబర్‌కు కాల్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ పేతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేస్తే అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు.
ఇలా ఒక్కొక్క అకౌంట్‌ను బ్లాక్ చేయడం కంటే కూడా ముందుగా.. నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు కాల్ చేసి సిమ్ నంబర్ బ్లాక్ చేయడం ఉత్తమం. నంబర్ బ్లాక్ చేయడం ద్వారా ఓటీపీలు రావు కాబట్టి ఫోన్ దొంగిలించిన వాళ్లు డబ్బులు కొట్టేసేందుకు ఛాన్స్ దొరకదు.