Ashwini Vaishnaw on BSNL | ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 5జీ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు సేవలందిస్తూ.. మరికొన్ని ముఖ్య నగరాలకు విస్తరిస్తున్న వేళ కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ( BSNL ) వచ్చే ఏడాది అంటే 2024లో 5జీ (5G services) సేవలు అందిస్తుందని చెప్పారు.
గురువారం ఆయన మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి ఒడిశాలో జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్, కటక్ నగరాల్లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ 5జీ సేవలు మొదలయ్యాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్లో 5జీ సేవల ప్రారంభ ముహూర్తం ప్రకటించారు.
వచ్చే రెండేండ్లలో ఒడిశా అంతటా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. గ్రామాల పరిధిలో టెలికం సేవలు అందించడానికి వంద 4-జీ టవర్లను కూడా ప్రారంభించామన్నారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను 5-జీకి అప్‌గ్రేడ్ చేసేందుకు టీసీఎస్, సీ-డాట్‌లతో కూడిన కన్సార్టియంతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్ చేయడానికి ఏడాది పడుతుంది.