Elon Musk | ట్విట్టర్ భవితవ్యంపై తానేమీ అంతగా ఆందోళనకు గురి కావడం లేదని సంస్థ న్యూ బాస్ ఎలన్‌మస్క్ తేల్చి చెప్పారు. ఉత్తమమైన ఉద్యోగులు మాత్రమే సంస్థలో కొనసాగుతారన్నారు. ‘నిబంధనలకు లోబడి పని చేస్తారా.. వైదొలుగుతారా?’ అని మస్క్ జారీ చేసిన ఆల్టిమేటంపై తీవ్రంగా స్పందించిన వందల మంది ట్విట్టర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం అయ్యారని వార్తలొచ్చాయి.
పలువురు ఉద్యోగులు కంపెనీని వైదొలగనున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో వచ్చే కొన్ని రోజులు సంస్థ ఆఫీసులు మూసేస్తున్నట్లు ట్విట్టర్ మెసేజ్‌లు పంపింది. ఈ నేపథ్యంలో నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎలన్‌మస్క్ ట్విట్టర్ వేదికగా రియాక్టయ్యారు. సామూహిక నిష్క్రమణల పట్ల తానేం అంతగా ఆందోళన చెందడం లేదన్నారు. ఉత్తమమైన వారు సంస్థలోనే కొనసాగుతారని రిప్లయ్ ఇచ్చారు. అయితే, ఉద్యోగుల సామూహిక రాజీనామాలతో ఎలన్‌మస్క్ గందరగోళంలో పడ్డారు.
భారీ స్థాయిలో ఉద్యోగుల నిష్క్రమణతో ట్విట్టర్లో సంక్షోభ భరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ట్విట్టర్లో కీలకంగా భావించే ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్‌లతో ఎలన్‌మస్క్, ఆయన సలహా బృందం సంప్రదింపులు జరిపి.., కంపెనీని వీడొద్దని కోరారు. అంతే కాదు వర్క్ ఫ్రం హోం పాలసీపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నది.
వారానికి 40 గంటలు వర్క్ ఫ్రం ఆఫీస్, మిగతా సమయం వర్క్ ఫ్రం హోం సేవలందించొచ్చునని ఎలన్‌మస్క్ సిబ్బందికి మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తున్నది. అద్భుతమైన పని చేసే వారు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకుంటే.. వారి మేనేజర్ ఆమోదం పొందాల్సి ఉంటుందని మస్క్ షరతు విధించారు. కీలక సిబ్బంది గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన మేనేజర్లకు ఉద్వాసన పలుకుతామని స్పష్టం చేశారు.
ఇప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకోని వారితోనూ ఎలన్‌మస్క్, ఆయన టీం సమావేశమై బుజ్జగించే పనిలో పడ్డారు. కానీ, అనూహ్య, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎలన్‌మస్క్‌తో విభేదిస్తున్న సిబ్బంది.. ఆయనతో సమావేశమైనా వైదొలిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ట్విట్టర్ బలోపేతానికి హార్డ్‌కోర్ సిబ్బంది అవసరం అని, ఉండాలా.. వద్దా.. అన్న నిర్ణయం తీసుకోవడానికి 36 గంటల గడువు విధించడంపై ఎగ్జిక్యూటివ్‌లు కినుక వహించారు. వైదొలగాలని నిర్ణయించుకునే ఎగ్జిక్యూటివ్‌లకు మూడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంటుంది.