Apple Airpods | టెక్ దిగ్గజం ఆపిల్ మార్కెట్ లోకి తీసుకొచ్చే ఉత్పత్తులు మిగతా సంస్థలతో పోలిస్తే కాస్త పిరమే. ఐ-ఫోన్ మొదలు ఐ-ప్యాడ్ వరకు ఏ ప్రొడక్ట్ కొనాలన్నా ఆలోచించాల్సిందే. ఎయిర్ ప్యాడ్స్ ఉంటే చాలు.. మనకు ఇష్టమైన పాటలు వినొచ్చు. ఆపిల్ రెండోతరం ఎయిర్ ప్యాడ్స్ 129 డాలర్లు పలుకుతున్నది. ధర భారీగా ఉండటంతో యూజర్లను అంతగా ఆకట్టుకోవడం లేదని సమాచారం. కానీ ఇతర ఎయిర్ ప్యాడ్స్ తయారీ సంస్థలు తక్కువ ధరకే యూజర్లకు అందుబాటులోకి తెచ్చి లాభాలు గడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చౌక ధరకు ఎయిర్ ప్యాడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి ఆడియో మార్కెట్ మీద పట్టు సాధించాలని ఆపిల్ ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నది. అందుకే రూ.8000ల (99 డాలర్లు)కే ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ పేరిట మరో హై ఎండ్ వర్షన్‌ను వచ్చే ఏడాది మధ్యలోగానీ, 2025 ప్రారంభంలో గానీ మార్కెట్లోకి వాటిని విడుదల చేయాలని తలపోస్తున్నదని వార్తలు వస్తున్నాయి..
తొలుత 2016లో ఎయిర్ ప్యాడ్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. యువతకు ఇష్టంగా.. అత్యంత సొగసుగా డిజైన్ చేయడంతోపాటు చార్జింగ్ పెట్టుకోవడానికి అనుకూలం, ఆపిల్ ఉత్పత్తులతో అనుసంధానించుకోవడానికి వీలుగా ఉండటంతో త్వరగానే పాపులారిటీ సంపాదించుకున్నాయి.
2020లో ఆపిల్ ఎయిర్ ప్యాడ్స్ మ్యాక్స్ విడుదల చేసింది. ఇయర్ హెడ్ ఫోన్స్ డిజైన్‌తో సౌండ్ క్వాలిటీ మెరుగుదల, నాయిస్ క్యాన్సిలేషన్ తదితర ఫీచర్లు తెచ్చినా ధర అధికం. కాగా, కొత్తగా రూపొందిస్తున్న `ఎయిర్ ప్యాడ్స్ మ్యాక్స్` హై ఎండ్ వర్షన్‌ను తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థలు జియోర్టెక్, హంటెంగ్ సంస్థలను మార్కెట్లోకి విడుదల చేయాలని ఆపిల్ కోరనున్నదని సమాచారం.