Artificial Intellegence | గత ఆరేడు నెలల క్రితం వరకు మనకు తెలియని సమాచారం గురించి తెలుసుకోవాలంటే గూగులమ్మే శరణ్యం. కానీ.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని `చాట్‌జీపీటీ` వచ్చాక ఇంటర్నెట్లో బ్రౌజింగ్ స్టైలే మారిపోయింది. ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ విజయం తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్లికేషన్స్ నిపుణులకు గిరాకీ పెరిగింది. దీని ప్రభావం భారత్‌లో కూడా ఉంది. ఐటీ సెక్టార్ ఇండస్ట్రీ బాడీ.. నాస్కామ్ అంచనా ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 4.16 లక్షల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులు ఉన్నారు. అయినా మరో 2.13 లక్షల మంది అదనపు ఏఐ ఇంజినీర్లకు డిమాండ్ నెలకొంది.
మరోవైపు చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ మొదలు బైదూ.. మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్.. దాదాపు అన్ని టెక్ కంపెనీలు సొంత ఏఐ సెర్చింజన్ల తయారీలో బిజీబిజీగా ఉన్నాయి. దీనివల్ల సిలికాన్ వ్యాలీ మొదలు యూరప్ వరకు.. పలు ఆసియా దేశాల్లో టెక్ కంపెనీలు ఏఐ ఇంజినీర్ల నియామకాలు చేపడుతున్నాయి. పలు టెక్ కంపెనీలు ఏఐ నిపుణులకు 30-50 శాతం ఇంక్రిమెంట్లతో ఉద్యోగాలు స్వాగతం పలుకుతున్నాయి. హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి గిరాకీ ఎక్కువగా ఉన్నా.. అవసరాలకు సరిపడా అందుబాటులో లేరు. కొన్ని కంపెనీలైతే సదరు ఏఐ ఇంజినీర్లకు డబుల్ శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నాయి.
గ్లోబల్ టెక్ ఇండస్ట్రీకి వెన్నెముకగా నిలిచిన భారత్.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఐటీ నిపుణుల్లో రెండో స్థానంలో ఉన్నా.. డిమాండ్‌కు సరిపడా ఇంజినీర్లను అందించలేకపోతున్నది. హై స్కిల్డ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా టాలెంట్ వంటి టూల్స్‌కు భారత్ రెండో అతిపెద్ద టూల్‌గా నిలిచిందని నాస్కామ్ చెబుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టాలెంట్ పూల్‌లో భారత్ వాటా 16 శాతం. అమెరికా, చైనా తర్వాత ఏఐ ఇంజినీర్లు గల దేశంగా భారత్ నిలిచింది.
బోస్టన్ కేంద్రంగా పని చేస్తున్న కారు సబ్స్క్రిప్షన్ స్టార్టప్ ఫ్లెక్సికార్.. బెంగళూరు డేటా సైన్స్ హబ్‌లో కంప్యూటర్ విజన్ స్పెషలిస్టులు, ఇంజినీర్ల టీం నిర్మిస్తున్నది. బెంగళూరులో సరిపడా ఇంజినీరింగ్ టాలెంట్ ఉన్నా.. ఇది సరిపోదని చెబుతున్నారు ఫ్లెక్స్ కార్ ఎగ్జిక్యూటివ్ డుమ్లావ్. కృత్రిమ మేధ (ఏఐ) నిపుణుల కోసం బెంగళూరులో అన్వేషణ సాగుతున్నది.
గత ఏడాది కాలంలో భారత్‌లో 66 న్యూ టెక్ ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాటిని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అని పిలుస్తున్నారు. వీటితో మొత్తం టెక్ ఇన్నోవేషన్ కేంద్రాల సంఖ్య 1600కి చేరింది. తక్కువ వేతనాల కోసం స్కిల్డ్ నిపుణులను సంపాదించుకునేందుకు ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు భారత్‌లో ప్రత్యేకించి సీజీసీ, ఆర్ అండ్ డీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.