పిల్లలూ! పెద్ద పెద్ద కట్టడాలు ఏవైనా సరే, ఒక్కసారి కడితే చాలు. అంతే ఎత్తున ఉంటాయి. మీలాగా ఏటా ఎత్తు పెరగవు! కానీ, ఓ కట్టడం ఉంది. అది మాత్రం ఎండకాలంలో కొంత ఎత్తు పెరుగుతుంది. అదే ఈఫిల్ టవర్.
ప్రపంచంలోని ప్రసిద్ధ కట్టడాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఇది ఫ్రాన్స్‌లో ఉంది. గుస్తావా ఈఫిల్ అనే ఇంజినీర్ క్రీ.శ. 1887లో దీని నిర్మాణం ప్రారంభించాడు. 1889 మార్చి 31న పూర్తి చేశారు. దీని ఎత్తు 1,052 అడుగులు. వేసవిలో మాత్రం 1,052.4 అడుగులు ఉంటుంది. అంటే, ఎంతోకొంత పెరుగుతుంది. ఈ టవర్ దాదాపు 7,000 టన్నుల బరువుంటుంది. 20.5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ప్రపంచంలో ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన కట్టడంగానూ దీనికి పేరుంది. ఈ టవర్‌కు 20 టన్నుల రంగు వేస్తారు. రంగును ఏడేండ్లకు ఒకసారి మారుస్తారు. దీనిపై మొత్తం 20 వేల విద్యుత్ బల్బులున్నాయి. టవర్‌ను మూడు అంతస్తులుగా నిర్మించారు. ఇందులో రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. సందర్శకులను పైకి తీసుకెళ్లడానికి సరిపడా లిఫ్ట్‌లు ఉన్నాయి. టవర్ పైనుంచి 42 మైళ్ల దూరం వరకూ చూడొచ్చు. దీనికి మొత్తం 1,710 మెట్లు ఉన్నాయి. బలంగా గాలి వీస్తే టవర్ ఊగుతుంది కూడా. అయితే, వేసవిలో కొంతమేర పెరగడానికి కారణం, వేడి వాతావరణంలో ఇనుము వ్యాకోచించడమేనని నిపుణులు అంటారు. వేడి తగ్గిన తర్వాత మళ్లీ సంకోచిస్తుంది.