బుధవారం 03 జూన్ 2020
Sangareddy - Mar 21, 2020 , 00:31:07

హే భగవాన్‌.. కుచ్‌ కరోనా..!

హే భగవాన్‌.. కుచ్‌ కరోనా..!

  • జిల్లా వ్యాప్తంగా ఆలయాలు బంద్‌ 
  • నిత్య పూజలు యథాతథం 
  • భక్తుల దర్శనాలకు బ్రేక్‌ 
  • నిర్మానుష్యంగా ఆలయ ప్రాంగణాలు 
  • పలు దేవాలయాల్లో ఉత్సవాల నిలిపివేత 

గుమ్మడిదల: జిల్లాలో సుప్రసిద్ధశైక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను కరోనావైరస్‌ను అరికట్టడానికి  నిలిపి వేశారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ హైదరాబాద్‌ ఆదేశాల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్‌తో కలిసి పాలకమండలి సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. చైనా నుంచి ప్రబలిన కరోనా వైరస్‌  ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో ప్రజల రక్షణార్థం వీరభద్రస్వామి రథోత్సవ వేడుకలతో పాటు ఆదివారం వరకు జరిగే బ్రహ్మోత్సవాలను పూర్తిగా నిలిపి వేయాలని తీర్మానం చేశారు. అలాగే, ఆలయంలో భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు చైర్మన్‌ వెల్లడించారు. భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాలు అందేవరకు తదుపరి దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నామని తెలిపారు. వెయ్యి ఏండ్ల  చరిత్ర ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిలిపి వేయడం మొదటిసారని చెప్పారు. కరోనా వైరస్‌ను తరమికొట్టడానికి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ సోమయ్య, ప్రధాన అర్చకుడు శివనాగులు, ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.

వైకుంఠపురంలో... 

సంగారెడ్డి మున్సిపాలిటీ: కరోనా ప్రభావంతో పట్టణ శివారులోని మహాలక్ష్మీ గోదా సమేత విరాట్‌ వేంకటేశ్వర దివ్యక్షేత్రం (వైకుంఠపురం)ను శనివారం మూసివేశారు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైకుంఠపుర ఆలయం కూడా ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు వైకుంఠపుర ఆలయంలో అర్చనలు, ఆర్జిత సేవలు, దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు జై శ్రీమన్నారాయణ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు తెలిపారు. అంతరాయానికి భక్తులు సహకరించాలని కోరారు. 

ఏడుపాయల దుర్గామాత... 

పాపన్నపేట: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో భక్తులకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయ గర్భగుడికి ఈవో ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు తాళం వేసి మూసి వేశారు. నిత్యం వేకువజామున అభిషేక పూజలు నిర్వహించి మళ్లి మూసి వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం ఈ నెల 31 వరకు నిలిపి వేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులు ఏడుపాయల దుర్గామాత దర్శనానికి రాకుం డా ఉండాలని ఆయన సూచించారు. 

కొమురవెల్లి మల్లన్న...

చేర్యాల, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారించేందుకు ముందస్తుగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మల్లన్న ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కలికంగా నిలివేస్తున్నట్లు ఈవో టంకశాల వెంకటేశ్‌ ప్రకటించారు. శుక్రవారం మల్లన్న ఆలయ కార్యాలయం లో పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌, చేర్యాల సీఐ రఘుతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆలయంలో మల్లన్న స్వామికి నిత్య కైంకర్యాలు యథావిథిగా నిర్వహిస్తామని, ఆలయంలో ఆర్జిత సేవలు (పట్నాలు, బో నాలు, అభిషేకాలు, నిత్య కల్యాణం, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయం) నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. 

బీరంగూడ మల్లికార్జునుడు.. 

అమీన్‌పూర్‌: కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శుక్రవారం మున్సిపల్‌ పరిధిలోని బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయాన్ని మూసివేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు దేవాలయం మూసివేతతోపాటు ఆర్జిత సేవలు, అన్నదానం, ప్రసాదాలు తదితర కార్యక్రమాలను నిలిపి వేశామని ఆలయ కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి, ఈవో వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.  

సిద్ధివినాయకుడు...

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో సిద్ధివినాయక దేవాలయాన్ని మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌ శివారులో ఉన్న సిద్ధివినాయక దేవాలయంలో నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 31వరకు దేవాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ రాధాబాయి, ఎంపీడీవో రాజశేఖర్‌, ఎస్‌ఐ. విజయ్‌రావు ఉన్నారు.

పలుగుపోచమ్మ ఆలయం

హత్నూర: మండలంలోని శేర్కాన్‌పల్లి శివారులోని పలుగుపోచమ్మ దేవాలయం వద్ద దర్శనము, ఆర్జిత సేవలు నిలిపివేశామని ఆలయ ఈవో శశిధర్‌ తెలిపారు.  ప్రభుత్వం కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం తీసుకుంటున్న నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడంతో అమ్మవారి సేవలు నిలిపి వేసినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు నిత్యం అమ్మవారికి పూజలు చేసి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, అమ్మవారి ఉత్సవాల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను సైతం మధ్యంతరంగా నిలిపివేశామన్నారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండడంకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి  ఆలయ ప్రాంగణంలో ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కేతకీ సంగమేశ్వరుడు...

ఝరాసంగం: అష్టలింగాలకు నిలయమైన కేతకీ సంగమేశ్వర స్వామి  దేవాలయం ప్రతి రోజు భక్తులతో రద్దీగా ఉండడంతో పాటుగా ఆలయ ఆవరణలో కేశఖండన, వివిధ కార్యక్రమాలు జరిగేవి. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంతో భక్తులు ఆలయానికి రాక పోవడంతో భక్తులు లేక నిర్మానుశ్యంగా కన్పిస్తుంది. ఆలయ అధికారులు శుక్రవారం ఆలయ గేట్లు,  అమృతగుండానికి తాళం వేశారు. ఆలయ గర్భగుడిలో స్వామి వారికి ఉదయం, రాత్రి పూజలు యథావిధంగా చేపట్టనున్నట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది  సుబ్రహ్మణ్యం, విలాశ్‌, అర్చకులు దిలీప్‌ మహారాజ్‌, వీర్‌సంగయ్యస్వామి, అంజయ్యస్వామి, బసవయ్యస్వామి, శివలింగయ్యస్వామిలున్నారు. 


logo