హార్రర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. భయపడుతూనే క్యూరియాసిటీతో ఆ సినిమాలు చూస్తుంటాం. అందుకే కొత్త హార్రర్ సినిమా వస్తుందంటే చాలు ఆడియెన్స్ అడుగులు థియేటర్ల వైపు పడుతుంటాయి. అలా ఈ వారం రిలీజైన హార్రర్ సినిమా ‘రా రాజా’. ఇండియాలోనే తొలిసారిగా మోహాలు స్క్రీన్‌పై కనిపించకుండా హార్రర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. శివ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుజి విజయ్, మౌనిక హెలెన్ జంటగా నటించారు. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టిందో చూద్దాం..
కథ..
తల్లిదండ్రులను ఎదిరించి రాజా (సుజి విజయ్), రాణి (మౌనిక హెలెన్) ప్రేమ వివాహం చేసుకుంటారు. కొంతకాలానికి తన కుటుంబ సభ్యులను రాజా కలుస్తాడు. అప్పటి నుంచి వారి జీవితాల్లో ఊహించని సంఘటలు చోటుచేసుకుంటాయి. రాజా తన భార్యపై రాజా దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు మౌనికపై దాడి చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
కథా విశ్లేషణ
తెలుగులో ఇప్పటివరకు వచ్చిన హార్రర్ సినిమాల్లో దాదాపు కథ ఒకటే తరహాలో ఉంటుంది. అయితే కొత్త తరహా కథనంతో, హార్రర్ ఎలిమెంట్స్‌ను జోడించి కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ‘రా రాజా’ సినిమా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇప్పటివరకు వచ్చిన హార్రర్ సినిమాలకు భిన్నంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖాలను చూపించకుండా సినిమా తీయడం అంత ఈజీ కాదు. కానీ.. దర్శకుడు శివ ప్రసాద్ దాన్ని సక్సెస్‌ఫుల్‌గా తెరపైకి తీసుకురాగలిగాడు. సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే ప్రేక్షకుడిని కథలో లీప్ చేయిస్తాడు. ఆ తర్వాత వచ్చే ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్
రాజాగా సుజి విజయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్లలో అయితే అతని నటన అద్భుతంగా ఉంది. రాణి పాత్రలో మౌనిక కూడా తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా వెంటాడే ఆత్మగా మౌనిక నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. చార్లీ పాత్రలో నాగూర్ ఖాన్ నవ్వించే ప్రయత్నం చేయగా, సీఐగా మధుకర్ కీలక పాత్ర పోషించాడు.
టెక్నికల్ పర్ఫార్మెన్స్
దర్శకుడు శివ ప్రసాద్ ఈ సినిమాకు ప్రధాన బలం. పాత్రల ముఖాలను చూపించకుండా కేవలం హావభావాలతోనే కథనాన్ని నడిపించడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో శివ ప్రసాద్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాకు మరో ఎస్సెట్ శేఖర్ చంద్ర మ్యూజిక్. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాస్తవ్ విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
రేటింగ్: 2.75