తారాగణం: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, నెడుముడి వేణు, బాబీ సింహ, సముద్రఖని, వివేక్, కాళిదాస్ జయరాం తదితరులు
సినిమాటోగ్రఫీ: రవివర్మన్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్జాయింట్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: శంకర్
‘భారతీయుడు’ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం. 1996లో వచ్చిన ఈ సినిమా భారతీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేవాపతి సాగించిన పోరాటం నేఫథ్యంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. భారీ నిర్మాణ విలువలు, కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ప్రధానాకర్షణలుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు-2’ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. అనేక అవాంతరాలను దాటుకొని దాదాపు ఆరేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవినీతిపై యుద్ధం చేయడానికి మళ్లీ తిరిగొచ్చిన సేనాపతి ఎంత మేరకు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు? తొలిభాగం తాలూకు అంచనాలను ఈ సినిమా అందుకుందా? అనే విషయాలను సమీక్షలో తెలుసుకుందాం.
కథ గురించి..
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్)కు సామాజిక స్పృహ ఎక్కువ. సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సమాజంలో జరుగుతున్న అవినీతి ఘటనలను ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తుంటాడు. ఉద్యోగం కోసం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతన్ని కలవరపరుస్తుంది. అందుకు కారకులైన వారిని శిక్షించాలంటూ అరవిందన్ చేసే పోరాటం ఫలించదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అతను ‘భారతీయుడు’ మళ్లీ రావాలంటూ సోషల్‌మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో తైవాన్ రాజధాని తైపీలో ఉంటున్న భారతీయుడు (సేవాపతి) ఇండియాకు తిరిగొస్తాడు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న కొందరు బడా బాబులను అంతమొందిస్తాడు. అదే క్రమంలో అవినీతికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం నింపుతూ రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. ఈ నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్న అరవిందన్ తండ్రి (సముద్రఖని) సైతం అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అవుతాడు. దీంతో మనస్తాపానికి గురైన అతని భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. తన కుటుంబంలో ఇంతటి విషాదానికి కారణం సేనాపతియేనని అరవిందన్ అతనిపై కోపం పెంచుకుంటాడు. ఇండియన్ గోబ్యాక్ అంటూ ప్రచారాన్ని ప్రారంభిస్తాడు? ఈ క్రమంలో ఏం జరిగింది? అవినీతిని అంతమొందిస్తానని తిరిగొచ్చిన సేనాపతిపై సామాన్య ప్రజలు కూడా తిరగబడటానికి కారణాలేమిటి? భారతీయుడి అసలు లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది.
కథా విశ్లేషణ..
తొలిభాగంలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా అవినీతి సమస్యపైనే దర్శకుడు ప్రధానంగా దృష్టిపెట్టారు. నాటికి, నేటికి వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగకపోగా అవినీతి మరింత వ్యవస్థీకృతం కావడంతో సేనాపతి సరికొత్త మిషన్‌తో దేశంలో అడుగుపెడతాడు. దేశంలోని అవినీతి ఘటనలు, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను చూపిస్తూ కథను ఆరంభించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే ఇవే తరహా సంఘటనలను ‘భారతీయుడు’ చిత్రంలో చూసి ఉండటంతో స్క్రీన్‌ప్లేలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. సమకాలీన సమస్యలను చర్చించినప్పటికీ వాటిని ఆవిష్కరించిన విధానం మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది.
సినిమా అసాంతం సేనాపతి అవినీతికి పాల్పడ్డ రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తను టార్గెట్ చేస్తూ వారిని తనదైన పద్దతిలో అంతం చేస్తుంటాడు. తొలి భాగం మొత్తం ఆ ఎపిసోడ్స్‌తోనే కథను నడిపించాడు దర్శకుడు శంకర్. ఎక్కువగా సంభాషణల ద్వారా సేనాపతి తన అవినీతి నిర్మూలన అజెండా గురించి ప్రజలకు చెబుతుంటాడు. కాంటెంపరరీ టైమ్స్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి దర్శకుడు శంకర్ చేసిన ప్రయత్నం బాగానే ఉందనిపించినా.. ఆ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం కొత్తగా అనిపించదు. ఇక ఈ సినిమాలో కూడా శంకర్ తనదైన స్థాయి భారీ నిర్మాణ హంగులు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. తైపీలో సేనాపతి అరంగేట్ర సన్నివేశాలను చూపించిన విధానం బాగుంది. ప్రీైక్లెమాక్స్ ఘట్టాల్లో కథ మలుపులు తీసుకోవడంతో అక్కడి నుంచి సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా మారుతాయి. కమల్‌హాసన్‌పై చిత్రీకరించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. కమల్‌హాసన్ లుక్స్, మ్యానరిజమ్స్ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ైక్లెమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మూడో భాగంపై ఆసక్తిని పెంచేలా ఉంది. కథలో అక్కడక్కడా మంచి ఎమోషన్స్ పండాయి. దేశంలో అవినీతి ఎంత వ్యవస్థీకృతమైపోయిందో, దానిని నిర్మూలించడానికి ఎలాంటి కార్యచరణ అవసరమో అనే అంశాలను దర్శకుడు శంకర్ తనదైన పంథాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఈ సినిమా ద్వారా నేటి యువతలో అవినీతి గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేయడం అభినందనీయం.
నటీనటుల పర్ఫార్మెన్స్
కమల్‌హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేనాపతి పాత్రలో మరోసారి తెరపై మ్యాజిక్ చేశారు. తనదైన నటనతో వన్‌మ్యాన్‌షోగా నిలిచారు. చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ చక్కగా ఒదిగిపోయాడు. ఆయన స్క్రీన్టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. ైక్లెమాక్స్ సీన్స్‌లో సిద్ధార్థ్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్రకు అంతగా ప్రాధాన్యం దక్కలేదు. ప్రియా భవానీ శంకర్ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. సీబీఐ ఆఫీసర్‌గా బాబీ సింహా, ప్రతినాయకుడు సకలకళా వల్లభన్ సద్గుణ పాండియన్‌గా ఎస్.జే.సూర్య తమదైన యాక్టింగ్‌తో మెప్పించారు. సముద్రఖని తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు.
ఇక సాంకేతికంగా అన్ని విభాగాల్లో అత్యున్నత ప్రమాణాలు కనిపించాయి. రవివర్మన్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచింది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో సినిమాను తెరకెక్కించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం ఫర్వాలేదనిపించింది. దర్శకుడు శంకర్ తనదైన శైలి గ్రాండియర్‌తో సినిమాను తెరకెక్కించాడు. అయితే కథలోని ఎమోషన్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
భిన్న గెటప్స్‌లో కమల్‌హాసన్ యాక్టింగ్
కథలో చర్చించిన అవినీతి అంశాలు
చక్కటి విజువల్స్, భారీ నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
రొటీన్‌గా సాగిపోయే సన్నివేశాలు
స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లోపించడం
అంతగా ఆకట్టుకోని సంగీతం
రేటింగ్: 2.5/5