కొత్తూరు, జనవరి 20 : ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జేపీ దర్గా ఆవరణలో శుక్రవారం వేలాది మంది భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహేశ్వరం, చేవెళ్ల, కల్వకుర్తి మండలాలకు చెందిన భక్తులతోపాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో తరలిరావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది.
ప్రతి ఏడాది గంధం నిర్వహించిన మరుసటి రోజు సాయంత్రం దర్గా ఆవరణలో దీపాలను వెలిగించి దీపారాధన చేస్తారని స్థానికులు తెలిపారు. హైదరాబాద్‌లోని యాకుత్‌పుర ఎమ్మెల్యే పాషా ఖాద్రీ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు దర్గాలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుండటంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాల్లో తమ కోర్కెలను బాబాకు తెలియజేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకున్నారు.