ఫార్మా పల్లెలు నిర్మానుష్యంగా మారాయి.. లగచర్లలో జరిగిన రగడతో ఉదయం లేచింది మొదలు.. మళ్లీ తెల్లవారే వరకు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసులు ఎప్పుడొచ్చి ఏం చేస్తారో.. ఎవరిని లాక్కెళ్తారోనని పల్లెవాసుల్లో గుబులు నెలకొన్నది. దుద్యాల మండలంలోని హకీంపేట, లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండా నిర్మానుష్యంగా మారాయి. మగవాళ్లు ఊరు విడిచి పట్టణాల్లో పనులకు కొందరు వెళ్తుండగా, కొందరు చెట్లు, పుట్టల వెంట కాలం గడుపుతున్నారు. ఇది ప్రజాపాలనా.. రజకార్ల పాలనా.. అంటూ పల్లెల్లోని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు అయితే గత్యంతరం లేక బిక్కుబిక్కుమంటూ ఇండ్ల వద్దనే ఉంటున్నారు.
– కొడంగల్, నవంబర్13
ఫార్మా చిచ్చుతో చెలరేగిన సంఘటనతో దుద్యాల మండలంలోని హకీంపేట, లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లోని ఫార్మా భూ బాధితుల్లో భయం నెలకొన్నది. ప్రశాంతంగా ఉంటే లగచర్ల గ్రామంలో రజాకార్ల పాలన గుర్తుకొస్తున్నదని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భూములు కోల్పోతున్నామన్న బెంగతో తిండి, తిప్పలు మాని దిగులుచెందుతున్నారు. ఇటీవల జరిగిన ఘటనతో ఫార్మాకు సంబంధం లేని వారిని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది నెలలుగా ఫార్మా భూ సేకరణకు ఇబ్బందులు పెడుతున్నారని, ఇవ్వబోమని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎవుసం చేసుకునే బతుకుతామని, మా జీవనాధారమైన భూములను లాక్కుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. లగచర్ల ఘటనకు ముందే భూ సేకరణ కోసం రావద్దని దుద్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశామని గ్రామస్తులు తెలిపారు. రైతుల అభీష్టం, ఆవేదనను గుర్తించని కాంగ్రెస్ సర్కార్ పోలీసులతో దాడులు చేయించడం సరికాదని వాపోతున్నారు.
గ్రామాల్లో ఉండాలంటే భయంగా ఉన్నది..
లగచర్ల ఘటనతో గ్రామంలో ఉండాలంటేనే భయంగా ఉన్నదని యువకులు ఆవేదన చెందుతున్నారు. ఉన్న ఎకరం, రెండు ఎకరాల పొలంలో పంట వేసుకుని ఆనందంగా జీవించే మాకు కాంగ్రెస్ వచ్చి కష్టాలు తెచ్చిపెట్టిందని బోరుమంటున్నారు. పోలీసులు ఎప్పుడు వచ్చి ఎవరిని తీసుకెళ్తారోనని భయం పట్టుకున్నదని పేర్కొంటున్నారు. గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్తున్నామని, పిల్లలు, వృద్ధులు ఇండ్ల వద్దనే ఉంటున్నారని, ఇలా ఉండాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని తమ గోడును వెళ్లగక్కుతున్నారు.
పొట్ట కూటి కోసం..
పొట్ట కూటి కోసం తండాల్లోని మగవాళ్లు దూర ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేస్తున్నారని, పిల్లలు, వృద్ధులు పశువులు, మేకలను మేపుకొంటూ జీవిస్తున్నారని మహిళలు తెలుపుతున్నారు. అర్ధరాత్రి ఇండ్లల్లోకి చొరబడి అరాచకం సృష్టిస్తారేమోనని జంకుతున్నారు. ఇండ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి బతుకుతామని పేర్కొంటున్నారు.