Wife Suicide | జవహర్‌నగర్, మార్చి 5: ప్రేమించుకున్నారు… పెళ్ళి చేసుకున్నారు… భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి బాలాజీనగర్ ముత్తుస్వామికాలనీలో చోటుచేసుకుంది.
ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన కథనం ప్రకారం… జవహర్‌నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ ముత్తుస్వామికాలనీలో దాసరి మహేష్, భార్య రమ్యతో కలిసి నివసిస్తున్నారు. గత ఫిబ్రవరి 2024లో మహేష్(22), రమ్య(23) ప్రేమించుకుని పెళ్ళి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రాడ్యూయేట్ పూర్తిచేసిన రమ్య ప్రేమికుడే సమస్తం అనుకుని పెళ్ళి చేసుకుంది. వివాహం చేసుకున్నప్పటి నుంచి మహేష్ పని లేకుండా జూలాయిగా తిరుగుతూ మద్యానికి డబ్బులు కావాలని ఇబ్బందులకు గురిచేస్తూ, రమ్యను మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు.
గత రెండు రోజుల క్రితం మహేష్ పీకల దాకా మద్యం సేవించి రమ్యను కొట్టాడు. విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు తెలపగా… సర్దిచెప్పి ఇంటికి పంపిచారు. ఈ నెల 4న మహేష్ మళ్లీ తాగొచ్చి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమ్య మంగళవారం రాత్రి ఇంట్లోని సీలింగ్‌ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటికి వచ్చిన భర్త మహేష్ ఇంటి తలుపులు కొట్టి చూడగా ఎంతకు తీయకపోవడంతో చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు పగులకొట్టగా రమ్య సీలింగ్‌ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
వెంటనే 108కు ఫోన్ చేయగా… పరిశీలించిన సిబ్బంది అప్పటికే చనిపోయిందని తెలిపారు. మా కూతురు రమ్యను భర్త మహేష్ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని రమ్య తల్లి ఐలమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు దాసరి మహేష్‌కు బుధవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.