వికారాబాద్/రంగారెడ్డి, జూలై 9 : జీవో నం.81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో ప్రాధాన్యమివ్వాలని వీఆర్ఏ జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రాములు పిలుపుమేరకు వికారాబాద్‌లో వీఆర్ఏ వారసులు, నాయకులు ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి.. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు వినతిపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020 సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలిస్తామని ప్రకటించిందని.. ఆ హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు రాష్ట్రంలో సమ్మె చేపట్టగా గత ప్రభుత్వం 81, 85 జీవోలను విడుదల చేసిందన్నారు. వివిధ శాఖల్లో 16,758 మంది వీఆర్ఏలను ఆయా శాఖల్లో సర్దుబాటు చేయగా.. మిగిలిన 3797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రస్తుత సర్కారు కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.
ప్రజా ప్రభుత్వం కొత్తగా చేపట్టే గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో 61 ఏండ్లు పైబడిన 3797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కాగా, కలెక్టర్ ప్రతీక్‌జైన్ సానుకూలంగా స్పందిస్తూ వీఆర్ఏ వారసుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వీఆర్ఏ వారసులకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. నిరసనలో వీఆర్ఏ జేఏసీ ధారూరు, మర్పల్లి, వికారాబాద్, యాలాల, పెద్దేముల్ అధ్యక్షులు సంగమేశ్, సంగమేశ్వర్, శ్రీనివాస్, నర్సింహులు, జనార్దన్ పాల్గొన్నారు.