వికారాబాద్, ఆగస్టు 23 : జాతీయతను చాటిచెప్పేలా 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరులను స్మరించుకోవడంతో పాటు, దేశ భక్తిని పెంపొందించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మార్గదర్శనం, కలెక్టర్ నిఖిల పర్యవేక్షణలో వికారాబాద్ జిల్లాలో 15 రోజులుగా నిర్వహించిన వజ్రోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. పల్లెలు, పట్టణాల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 9 నుంచి 21 వరకు భారత స్వతంత్ర వజ్రోత్సవాలను నిర్వహించారు.
ఆగస్టు 9 : వికారాబాద్ పట్టణంలోని డీపీఆర్సీ భవనంలోని సమావేశ హాలులో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ నిఖిల, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
10న : గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు చేశారు. కలెక్టర్ నిఖిల వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి ఎక్స్ రోడ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు అధికారులతో కలిసి మొక్కలునాటారు.
11న : జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వందలాది మందితో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
12న : దేశ భక్తిని పెంపొందించే పలు చిత్రాలు, డాక్యుమెంటరీలను జిల్లాలోని కేబుల్ స్థానిక చానల్లో ప్రసారం చేశారు.
13న : జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు భారీ ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు.
14న : జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథుల సమన్వయంతో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో సాంస్కృతిక జానపద కార్యక్రమాలను నిర్వహించారు.
15న : వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప సభాపతి టి.పద్మారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
16న : ఏక కాలంలో తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనాలు చేశారు.
17 : జిల్లా దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.
18 : జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో ఫ్రీడం కప్ పేరుతో క్రీడలు నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలను నిర్వహించారు.
19 : దవాఖానలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
20 : దేశ భక్తి, జాతీయ స్ఫూర్తిని తెలిపే విధంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మెప్మా, ఐసీడీఎస్ మహిళా సంఘాలు, మహిళా అధికారులు, మహిళలు తరలివచ్చి రంగు రంగుల ముగ్గులు వేశారు.
21 : వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ నిఖిల మొక్కలు నాటారు.
ఆలోచింపజేసిన గాంధీ చిత్రం
జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన గాంధీ చిత్రాన్ని జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, మర్పల్లిలో ప్రదర్శించారు. ఈ నెల 9,10,11 వరకు, 16 నుంచి 21వరకు రెండు విడుతలుగా ప్రదర్శించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తిలకించారు. 38,945 మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని వీక్షించారు.
స్వాతంత్య్ర పోరాట సంగ్రామం దృశ్యాలు,సమరయోధుల త్యాగాలను తెలియజేసేలా సాగిన ఈ చిత్రం విద్యార్థులను అమితంగా ఆకట్టుకున్నది. కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ఆనంద్, విద్యారులతో కలిసి గాంధీ చిత్రాన్ని వీక్షించారు.
విద్యుత్ దీపాల కాంతుల జిగేల్..
జిల్లాలో వేడుకలు దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యాశాఖ, యువజన సర్వీసులు క్రీడా శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీ రాజ్, సమాచార పౌర సంబంధాల శాఖలు క్రియాశీలక పాత్ర పోషించాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేశారు.
ప్రతి ఒక్కరికీ అభినందనలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మార్గదర్శనం మేరకు ఈ నెల 9 నుంచి 21వరకు నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు విజయవంతం అయ్యాయి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను తెలియజేసేలా వేడుకల్లో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, పౌరులకు ధన్యవాదాలు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు.
– నిఖిల, కలెక్టర్ వికారాబాద్