ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 18: పనిని మరింత సులభతరం చేసేందుకు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఆశవర్కర్లు అందించేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందజేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ కవిత ఆధ్వర్యంలో శుక్రవారం ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో టెక్నాలజీ పెరిగి పోయిందని, హార్డ్ వర్క్, పేపర్ వర్క్‌ను తగ్గించుకుని స్మార్ట్ వర్క్‌తో పని భారం తగ్గించుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆశవర్కర్లకు తగిన సదుపాయాలను కల్పించటం లేదని, అత్యధిక వేతనాలను చెల్లించే రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రభుత్వం ఆశవర్కర్ల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు ఉత్తమ సేవలను అందించారన్నారు. ప్రజలకు వైద్య సేవలను అందించాలంటే వైద్య సిబ్బందికి సౌకర్యాలు కూడా ఎంతో అవసరం కాబట్టి ప్రభుత్వం గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ దామోదర్, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శోభ, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్ కోస్గీ శ్రీను, నాయకులు దేవేందర్‌యాదవ్, యాదయ్య, రవినాయక్, వెంకటేశ్, శివకుమార్, రాఘవేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
ఇంటింటికీ సురక్షిత తాగునీరు
షాద్‌నగర్‌టౌన్ : మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని తిరుమల, ఆర్టీసీ, అయ్యప్పకాలనీల్లో మిషన్ భగీరథ నల్లాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఏ ఒక్క ఆడబిడ్డ నీటి కోసం ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం మిషన్ భగీరీథ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇప్పటికే సగానికి పైగా వార్డుల్లోని నివాసాలకు మంచినీళ్లు అందుతున్నాయన్నారు. మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లను, నూతన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. వార్డుల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్ కౌసల్య, కొందూటి మహేశ్వరి, రాజు, నాయకులు మన్నె నారాయణ, శ్రీశైలం, నర్సింలు, శేఖర్, రాఘవేందర్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌తో మెరుగైన వైద్యం
కొత్తూరు : సీఎం రిలీఫ్‌ఫండ్‌తో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన మల్లేశ్ ముదిరాజ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 28 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు శ్రీను, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్, జనార్దన్‌చారి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.