వికారాబాద్ : ప్రజల ఆకాంక్ష మేరకు నారాయణపూర్ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగిందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో మీతో నూనే కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఉత్తర్వుల పత్రాలను గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో విలీనం కోసం ప్రతిపాదనలు రాగ దానిని రద్దు చేయించి, ప్రజల కోరిక మేరకు మళ్లీ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యుత్ వైర్లను సరి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
ఇళ్ల మధ్యన పెంటకుప్పలను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. పంట పొలాలకు వెళ్లే పార్మిషన్ రోడ్డు ఇబ్బందికరంగా ఉన్న మురుగు కాలువ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అందుకు అధికారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, ఎంపీపీ చంద్రకళ, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.