తాండూరు రూరల్ : దళిత బంధు పేదరిక నిర్మూలనకు దోహదపడుతోందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్ అన్నారు. శనివారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో దళితబంధు పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగు రేఖలు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంత మట్టుకే రుణాలు అందేవని, ప్రస్తుతం ఒక్కో దళిత కుటుంబానికి నేరుగా వారి ఖాతాల్లో రూ. 10 లక్షల జమ అవుతాయన్నారు.
లబ్దిదారుడు తమనకు నచ్చిన యూనిట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందన్నారు. దళితబంధు పథకం అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుండటంతో రాబోయే రోజుల్లో దళితులు ధనికులు కావడం ఖాయమని పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు నాలుగైదు రకాల యూనిట్లు నెలకొల్పడం, లేదంటే కుటుంబ పెద్ద ఒక యూనిట్, వారి పిల్లలు చదువుకున్నవారుండి ఆసక్తి గల అంశాల్లో ప్రభుత్వమే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పిస్తుందని తెలిపారు.
అదే విధంగా అన్నదమ్ముల పిల్లలు కలిపి మెగా యూనిట్‌ను నెలకొల్పుకోవడానికి కూడా అవకాశం కల్పించిందన్నారు. లబ్ధిదారుడు తనకు అవగాహన లేదని, మీరే సూచించడండని అధికారులకు తెలిపితే రిసోర్స్ పర్సన్లు పర్యటించి లబ్ధిదారుడు నివాసముంటున్న ప్రాంతంలో ఏ యూనిట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందో పూర్తిస్థాయి సర్వే చేసి పలు సూచనలు కూడా చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి హన్మంతరావు, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, తాహసీల్దార్ చెన్నప్పలనాయుడు ఉన్నారు.