వికారాబాద్ : అవకాశం ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో రానిస్తారని తెరాస జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ పదవీ చేపట్టి 2సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం నుంచి రెండు ఏళ్ల పాటు ప్రజలకు చేసిన సేవలను ప్రొజెక్టర్ సహాయంతో వీడియోను చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుడి కుటుంబానికి చైర్పర్సన్ పదవీ ఇవ్వడం జరిగిందన్నారు. మహిళ చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టి వికారాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుందన్నారు.
పార్టీ ఆదేశాల మేరకు కట్టుబడి పని చేస్తూ.. కౌన్సిలర్ల సహాకారంతో వార్డుల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో అందరూ బయపడుతుంటే చైర్పర్సన్ ధైర్యంగా ముందుండి కరోనా రోగులకు ధైర్యాన్ని అందించారని కొనియాడారు. రాష్ట్రంలో వికారాబాద్‌ను 4వ స్థానంలో నిలిపి ఈ ప్రాంతానికి పేరు తెచ్చారన్నారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డును అందుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకురుస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామన్నారు. ప్రతి వార్డులో, ఇంటింటికీ తిరిగి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు.
పారిశుధ్య కార్మికులు, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అందరి సహాయ సహాకారాలతో పట్టణ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. అనంతరం కౌన్సిలర్లందరితో కలిసి కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నవీన్‌కుమార్, రామస్వామి, సురేష్, మురళీ, పుష్పలత, గాయత్రీ, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.