యాచారం, మార్చి 13: రంగారెడ్డి జిల్లాలోని (Rangareddy) యాచారం-చరికొండ రోడ్డు ఎంతో అధ్వాన్నంగా మారింది. రోడ్డంతా అడుగడుగునా కంకరతేలి గుంతలమయంగా మారింది. సుమారు 11కిలో మీటర్ల మేర రోడ్డు బీటి కోట్టుకుపోయి కంకరతేలి దారుణంగా తయారైంది. ఈ రోడ్డు వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు నిత్యం నరకంచూపెడుతుంది. అడుగడుగున గుంతలతో కూడిన దారివెంట ప్రయాణించాలంటేనే ప్రయాణికులు, వాహనదారులు జంకుతున్నారు. ఆ రోడ్డుపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవటం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నుంచి పల్లెచెల్కతండా మీదుగా కడ్తాల మండలం చరికొండ వెళ్లే రోడ్డు మరింత అధ్వాన్నంగా మారింది. రోడ్డంతా పూర్తిగా బీటి కొట్టుకుపోయి కంకరతేలింది. రెండు మండలాలకు చెందిన ప్రయానికులకు ఈ రోడ్డు నానా అవస్థలకు గురి చేస్తుంది. ఈ రోడ్డుపై ప్రయాణించి పల్లెచెల్కతండా, చరికొండ, మద్విన్, నాగిళ్ల, అప్పారెడ్డిపల్లి, ఎక్వాయపల్లి, గోవిందాయపల్లి, ఆకుతోటపల్లి, చెట్టిపల్లి గ్రామాలకు హైదరాబాద్, యాచారం, మాల్ ప్రాంతాల నుంచి చేరుకోవడానికి ప్రయాణికులు నిత్యం పదుల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారు.
ఆకుతోటపల్లి నుంచి హైదరాబాద్, ఆమన్‌గల్ నుంచి మాల్‌కు ఆర్టీసీ బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆటోలు, కార్లు, ద్విచక్రవాహన దారులు నిత్యం ఈ రోడ్డుగుండా ప్రయాణిస్తారు. పైగా అటు నాగార్జున రహాదారి నుంచి శ్రీశైలం ప్రధాన రహదారిని తక్కువ సమయంలో తక్కువ దూరంలో నేరుగా చేరుకుంటారు. కడ్తాల మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఈ రోడ్డుగుండా వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. వీరంతా ఈ లింకురోడ్డుపై ప్రయాణిస్తూ 11కిలో మీటర్ల మేర ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణిస్తే వాహనాలు మెకానిక్ షెడ్డును ఆశ్రయించవల్సిందేనని వాహనాదారులు వాపోతున్నారు. అయినా సంబంధిత అధికారుల్లో ఏ మాత్రం కదలికలు లేకపోవటం గమనార్హం. నిత్యం ప్రయాణికుల రాకపోకలకు ఎంతో ఉపయోగపడే ఈ రోడ్డుపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి, పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్డుకు మరమత్తలు చేయించాలి..
మేడిపల్లి నుంచి చరికొండ వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా తయారైందని ఏవీజీ ఫౌండేషన్ చైర్మేన్ ఆడాల గణేష్ అన్నారు. రోడ్డంతా ఆద్యాంతం గుంతల మయంగా మారి పదకొండు కిలోమీటర్లు ప్రయాణికులకు, వాహనదారులకు నిత్యం నరకం చూపెడుతుంది. రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయినప్పట్టికి అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డకు మరమ్మతులు చేయించాలి. అద్వాన్నంగా రోడ్డుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల, వాహనదారుల కష్టాలు తీర్చాలి. లేదంటే వాహనదారులతో కలిసి ఆందోళన చేస్తాం.