ఐస్క్రీం తిన్నాక ఆ డబ్బాను ఏం చేస్తారు?. ఆయిల్ డబ్బాల్లో నూనె అయిపోయాక వాటిని ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు …‘ఇంకేం చేస్తాం చెత్త బుట్టలో పడేస్తాం’ అని ఎవరైనా చెప్పేస్తారు.. కానీ, ఈ మహిళ మాత్రం మొక్కలను పెంచుతానని చెప్తున్నారు. పనికి రానిదంటూ ఏ వస్తువూ ఉండదని, ప్రతి వస్తువులో మొక్కలను పెంచొచ్చని పేర్కొంటున్నారు.
హయత్నగర్ రూరల్, జనవరి 1: అది పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధి, తట్టిఅన్నారంలోని జీవీఆర్కాలనీ. ఆమె పేరు విక్టోరియా. చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్తుంటారు. ఆమె ఇంటి గేటులోకి అడుగుపెట్టగానే అంతా పచ్చగా కనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది. వాడిపడేసే ప్రతీ వస్తువు అక్కడ వినియోగంలో ఉంటుంది. అందు లో పచ్చని మొక్క ఒకటి పెరుగుతూ కనువిందు చేస్తుం ది. యూజ్ అండ్ త్రో గ్లాసు మొదలు అరిగిపోయిన బండి టైరు వరకూ అన్నింట్లో ఏవో మొక్కలు కనిపిస్తాయి. డిజైన్ మొక్కలతోపాటు ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు కూడా దర్శనమిస్తాయి.
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చే బాక్సుల్లో కొత్తిమీర, ఇతర డిజైన్ మొక్కలను పెంచుతున్నారు.
వాటర్ బాటిళ్లను వివిధ రకాలుగా పేర్చి రకరకాల మొక్కలను పెడుతున్నారు.
ఇంట్లోని పాడైన ఫ్రిజ్, కూలర్లను విరగ్గొట్టి కింది భాగాల్లో టమాట, కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలను సాగు చేస్తున్నారు.
పగిలిన కుండలు, విరిగిన డ్రమ్ములు, బకెట్లలోనూ మొక్కల పెంపకం.
వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసే సమయం లో వచ్చే థర్మోకోల్ను సైతం మొక్కల కోసం వినియోగిస్తున్నారు.
ఇక ఆయిల్ డబ్బాల్లో నూనె అయిపోగానే పొడవుగా పెరిగే మొక్కలను నాటుతున్నారు.
ఇంట్లోనే కూరగాయల సాగు
మా కుటుంబ సభ్యులం బయట కూరగాయలను కొనం. అవసరమైన అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలను ఇంట్లోనే పండిస్తున్నాం. టమాట, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇతర తీగ జాతివి కూడా ఇంట్లోనే సాగు చేస్తు న్నాం. ప్రతి వస్తువూ పనికి వస్తుంది. యూజ్ అండ్ త్రోలా వినియోగించే డబ్బాల్లోనూ మొక్కలను పెంచుతున్నాం. ఇంట్లోని కిటికీల్లోనూ వివిధ రకాల డిజైన్ మొక్కలను పెడుతున్నాం. మొక్కల సంరక్షణకు ప్రతిరోజూ కొంతసమయాన్ని కేటాయిస్తా. ఇంటికొచ్చే అతిథులు సైతం వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ మొక్కలతో సెల్ఫీలు దిగుతున్నారు.