ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో విద్యార్థులకు టీకా పంపిణీ
12-14 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు
రంగారెడ్డి జిల్లాలో 1.97 లక్షల మంది
ఇప్పటివరకు 5,078 మంది చిన్నారులకు వ్యాక్సిన్
రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నది. 15 ఏండ్లకు పైబడిన వారికి టీకా పంపిణీ దాదాపుగా పూర్తికాగా, ఈ నెల 16వ తేదీ నుంచి 12-14 ఏండ్ల పిల్లలకు టీకా ఇస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 5,078 మంది చిన్నారులకు టీకాలు వేశారు. జిల్లాలో 12-14 ఏండ్లవారు మొత్తం 1.97 లక్షల మంది ఉండగా.. వీలైనంత తొందరగా వందశాతం పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా శనివారం నుంచి స్కూళ్లలోనే వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వైద్యారోగ్య సిబ్బంది వెళ్లి విద్యార్థులకు టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పది రోజుల్లో అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్ పంపిణీని పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. 15-18 ఏండ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో 12-14 ఏండ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈనెల 16న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి 12-14 ఏండ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా, ఇప్పటివరకూ 5,078 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాక్సిన్లు వేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ-విద్యాశాఖల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాక్సిన్ వేసేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12-14 ఏండ్లలోపు వారు 1.97 లక్షల మంది ఉండగా, వారందరికీ సరిపోను వ్యాక్సిన్‌ను కూడా అందుబాటులో ఉంచారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ మరోమారు కరోనా వైరస్ విజృంభించినా ఎక్కువ మంది వైరస్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే 12-14 ఏండ్లలోపు విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వారం, పది రోజుల్లో పూర్తి చేసేందుకుగాను అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఆధార్ కార్డు నంబర్‌ను కొవిన్ యాప్‌లో నమోదు చేసి విద్యార్థులకు వ్యాక్సిన్ వేయనున్నారు. మరోవైపు 15-18 ఏండ్లలోపు వారు 1.70 లక్షల మంది ఉండగా, ఇప్పటివరకు 1.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాగా, మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేసుకునేలా జిల్లా వైద్యారోగ్య శాఖ గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కల్పిస్తున్నది.
ఇప్పటివరకు 47 లక్షల డోసులు పూర్తి…
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 47 లక్షల డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. వీటిలో ఫస్ట్ డోస్‌కు సంబంధించి 27 లక్షల డోసులు(114 శాతం), సెకండ్ డోస్ 20 లక్షల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. అయితే సెకండ్ డోసుకు సంబంధించి మరో 2 లక్షల డోసులు వేయాల్సి ఉన్నది. అయితే సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవడంలో కొంత మంది కొవిడ్ వైరస్ ప్రభావం పోయిందనే నిర్లక్ష్యం వహిస్తుండటంతో వారిపై ప్రత్యేక దృష్టి సారించి వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో, మండలాల్లో, మున్సిపాలిటీల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వ్యాక్సినేషన్‌పై ఇంటింటికి వెళ్లి ఆరా తీసి, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఇంకా సెకండ్ డోస్ వేసుకోని వారి వివరాలను సేకరించి జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది నేరుగా వారి ఫోన్ నంబర్లకు కాల్ చేసి వ్యాక్సిన్ వేసుకునేలా ప్రతిరోజూ అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా జిల్లా అంతటా ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించడంతోపాటు క్షేత్రస్థాయికి వెళ్లి మరీ వైద్యబృందాలు వ్యాక్సిన్ వేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ మొబైల్ వాహనాల ద్వారా వైద్య బృందాలు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. అన్ని పీహెచ్‌సీల్లో సరిపోను వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈనెలాఖరులోగా వంద శాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా 12-14 ఏండ్లలోపు వారికి వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నాం. జిల్లాలో 12-14 ఏండ్లలోపు వారికి సరిపోను వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నది. అదేవిధంగా ఈ నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
– స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా