జిల్లాలో ధరణి దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి. మొత్తం అప్లికేషన్లలో 90 శాతం వరకు రిజెక్టు కాగా, మిగిలినవి అధికారుల ఆమోదం పొందా యి. నెల రోజుల్లో దాదాపు 8 వేల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. దరఖాస్తులు అధికంగా రిజెక్టు అవుతుండడంతో భూబాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటుండడంతో అవి పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఈ అప్లికేషన్ల పరిష్కారా నికి తహసీల్దార్ల రిపోర్టులు కీలకం కావడంతో వారు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వికారాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తిరస్కరణకు గురైనవే అధికంగా ఉంటున్నాయి. మొత్తం అప్లికేషన్లలో 90 శాతం వరకు రిజెక్టు కాగా మిగిలినవి అధికారుల ఆమోదం పొందాయి. గత నెల రోజుల్లో దాదాపు 8 వేల దరఖాస్తులను తహసీల్దార్ మొదలుకొని ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిల్లో పరిష్కరించారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం లక్ష్యానికి అనుగుణంగా దరఖాస్తులను పరిష్కరించామని చెబుతున్నా.. అధికంగా తిర స్కరించినవే ఉండడంతో భూ సమస్యలు పరిష్కారం కాని రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించడంతో గత నెల రోజుల్లో పది శాతం వరకు పరిష్కారానికి నోచుకోగా 90 శాతం అప్లికేషన్లు రిజెక్టు అయ్యాయి.
అధికంగా తిరస్కరణకు గురవుతుండడంతో భూబాధితులు మళ్లీ దరఖాస్తు చేసు కుంటుండడంతో రోజురోజుకూ అప్లికేషన్లు పేరుకుపోతున్నాయి. అయితే భూబాధి తులతో సంబంధం లేకుండా రిపోర్టులు పంపించాలని పై అధికారుల నుంచి ఆదేశా లు రావడంతో తహసీల్దార్లు అన్ని సరిగ్గా ఉన్నా ఏదో ఒక కొర్రీ పెడుతూ రిజెక్టు అయ్యేలా పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ధరణి ఆపరేటర్లతో రిపోర్టులను రెడీ చేయిస్తూ. సంబంధిత రైతులు డబ్బులు ఇవ్వకుంటే తప్పుడు రిపోర్టులు పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
8 వేల దరఖాస్తులకు పరిష్కారం..
జిల్లాలో గత నెల రోజుల్లో 8 వేల దరఖాస్తులను పరిష్కరించామని అధికారులు చెబుతున్నా.. పెండింగ్‌లో పడుతున్న దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. అయితే దరఖాస్తులను ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచొద్దని, త్వరగా పరిష్కరించాలని నిర్ణయించిన కలెక్టర్ ప్రతీక్ జైన్…అందుకు అనుగుణంగా తహసీల్దార్ల నుంచి రిపోర్టుల ను తెప్పించుకొని పరిష్కరిస్తున్నారు. అయితే కొందరు తహసీల్దార్లు రిపోర్టులు పం పించడంలో అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్ రిపోర్టు తప్పనిసరి కావడంతో ఇదే అదునుగా చేసుకొని కొందరు తహసీల్దార్లు కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై జోరుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జీఎల్ఎం మాడ్యుల్ (గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్) దరఖాస్తులు తహసీల్దార్ల స్థాయిలోనే పరిష్కారం అవుతుండడంతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తహసీల్దార్ల కనుసన్నల్లో నడుస్తున్న రిపోర్టుల దందాపై కలెక్టర్ దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ఆర్ఎస్ఆర్ సమస్యే ప్రధానం..
జిల్లాలో ప్రధానంగా టీఎం-33 అనంతరం ఆర్ఎస్ఆర్ సమస్యతోనే రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు ఉన్న భూమి కంటే ఎక్కువ లేదా తక్కువ భూమి ఉన్నట్లు ధరణి ఆపరేటర్లు తప్పుగా ఎంట్రీ చేయడంతో ఆర్ఎస్ఆర్ సమస్య ఉత్పన్నమై.. దాని పరిష్కారానికి రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాత రికార్డుల ప్రకారం సంబంధిత సర్వేనంబర్‌లో ఏ రైతుకు ఎంత భూమి ఉందనే వివరాలను తెలుసుకొని ఆర్ఎస్ఆర్ సమస్యను పరిష్కరించొచ్చు.. కానీ, రికార్డుల్లోనూ తప్పుగా ఎంట్రీ కావడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. అంతేకాకుండా ఓ రైతు పేరిట ఎక్కువ భూమి నమోదైనట్లు ధరణిలో గుర్తించడం పెద్ద కష్టంగా మారడం.. సంబంధిత రైతూ సహకరించకపోవడంతో ఈ సమస్య పరిష్కారం కావడంలేదు. అయితే ఆర్ఎస్ఆర్ సమ స్య పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో ఆప్షన్ ఇచ్చినా…కేవలం 10 శాతం మాత్రమే వీలుందని, శాశ్వత పరిష్కారానికి క్షేత్రస్థాయిలో భూసర్వే చేయాలని రెవెన్యూ అధి కారులు పేర్కొంటున్నారు. కాగా కలెక్టర్ ఆర్ఎస్ఆర్ సమస్య పరిష్కారమైన తర్వాతే రిపోర్టులను తనకు పంపించాలని తహసీల్దార్లను ఆదేశించినట్లు సమాచారం.