కొండాపూర్, డిసెంబర్ 27 : చేనేత, హస్త కళాకారులకు తోడ్పాటునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర వస్త్ర, రైల్వే మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి దర్శన విక్రమ్ జర్దోష్ అన్నారు. మంగళవారం ఆమె మాదాపూర్‌లోని శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేనేత, హస్త కళాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాకారుల ఉత్పత్తులకు అవసరమైన మార్కెట్లను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారి నైపుణ్యాలను తెలుసుకున్నారు. మంత్రితో పాటు శిల్పారామం ప్రత్యేక అధికారి జీ కిషన్‌రావు, మేళా నిర్వాహకుడు అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.