మొయినాబాద్, జూన్11: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కొన్ని పాఠశాలలను ఎంపిక చేసింది. అందులో భాగంగా మొయినాబాద్ మండలంలో 19 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఎంపికైన ప్రతి పాఠశాలకూ రూ.లక్ష నిధులను మంజూరు చేసింది. తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరును మార్పు చేసింది. పాఠశాలల భవనాలు, మరుగు దొడ్ల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు వంటి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తి కాలేదు. నత్త నడకన సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.
ఎంపికైన అమ్మ ఆదర్శ పాఠశాలలు..
మొయినాబాద్ మండలంలో 19 పాఠశాలలు ఎంపికయ్యాయి. అందులో రెడ్డిపల్లి, చందానగర్ ఎన్కేపల్లి, అమ్డాపూర్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలు, నాగిరెడ్డిగూడ, ముర్తుజాగూడ, శ్రీరాంనగర్ గ్రామాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలు, కుతుబుద్దీన్గూడ, ఎల్కగూడ, సురంగల్, చాకలిగూడ, చిన్నషాపూర్, సజ్జన్పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, మోత్కుపల్లి, అప్పోజిగూడ, ఎతుబార్పల్తి గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు ఎంపికయ్యాయి. మౌలిక వసతుల కోసం ప్రతి పాఠశాలకూ రూ.లక్ష మంజూరు చేసింది. పాఠశాలల ప్రారంభం నాటికి పనులు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ శశాంక గత నెల 31వ తేదీన పాఠశాలలను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ పనులు మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.