మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఎస్-బీపాస్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల ఏర్పాటుకు అనుమతులు సులభంగా, వేగంగా లభిస్తున్నాయి. దరఖాస్తు నుంచి అనుమతుల జారీ వరకు అన్నీ ఆన్‌లైన్‌ద్వారా జరుగుతుండడంతో అవినీతికి అడ్డుకట్టపడింది. ప్రస్తుతం ఈ విధానాన్ని గ్రామ పంచాయతీల్లోనూ అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రస్తుతమున్న డీపీఎంఎస్, ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్-బీపాస్‌తో అనుసంధానం చేయడం, జీపీకో బ్యాంకు ఖాతా తెరువడం వంటి ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. మార్గదర్శకాలు రాగానే కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
వికారాబాద్, నవంబర్ 3, (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులను జారీ చేసేందుకు అమలు చేస్తున్న టీఎస్ బీపాస్ విధానాన్ని గ్రామపంచాయతీల్లోనూ త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. గ్రామపంచాయతీల్లో అక్రమంగా అనధికారిక లే అవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో టీఎస్-బీపాస్‌ను అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామపంచాయతీ పరిధిలో లే అవుట్ల అనుమతులకు ప్రస్తుతం అమలుచేస్తున్న డీపీఎంఎస్, ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్-బీపాస్‌తో అనుసంధానం చేయనున్నారు. భవన నిర్మాణాల అనుమతులను కూడా ఇకపై టీఎస్-బీపాస్ విధానంలోనే ఇవ్వనున్నారు. ఇందుకుగాను జీవో నంబర్ 52ను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటివరకు గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శి సదరు దరఖాస్తును పరిశీలించి ఈ-పంచాయతీ ద్వారా అనుమతులిస్తూ వస్తున్నారు. టీఎస్-బీపాస్ అమల్లోకి వచ్చినట్లయితే గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణాలతోపాటు లే అవుట్ల అనుమతులను టీఎస్-బీపాస్ ద్వారానే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత అధికారులకు శిక్షణ
గ్రామపంచాయతీల్లో ఎక్కువగా గ్రామకంఠం ఆధారంగా.. వారసత్వంగా వచ్చిన స్థలాల్లో నిర్మాణాలు చేసుకుంటారు. సంబంధిత నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశముంది. అయితే గ్రామ పంచాయతీల్లో టీఎస్-బీపాస్ అమలుకు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది. మరోవైపు టీఎస్-బీపాస్ విధానాన్ని గ్రామపంచాయతీల్లోనూ అమల్లోకి తీసుకురావడం ద్వారా నిర్మాణాల వివరాలతోపాటు పన్ను వసూలు కూడా పకడ్బందీగా జరుగనుంది. గ్రామపంచాయతీల్లో టీఎస్-బీపాస్ విధానాన్ని అమలుచేసేందుకు ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులతోపాటు డివిజన్ పంచాయతీ అధికారులకు శిక్షణనిచ్చే కార్యక్రమం కూడా పూర్తి కావడంతో గ్రామపంచాయతీల్లో టీఎస్-బీపాస్ విధానాన్ని అమలు చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోనే వికారాబాద్ మున్సిపాలిటీతోపాటు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి విజయవంతం కావడంతో అన్ని మున్సిపాలిటీల్లోనూ అమల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం గ్రామపంచాయతీల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
వేగంగా కొనసాగుతున్న టీఎస్-బీపాస్ అమలు ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామపంచాయతీల్లో టీఎస్-బీపాస్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఓ వైపు డీపీఎంఎస్, ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్-బీపాస్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తుండగా.. మిగతా ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. టీఎస్-బీపాస్ సింగిల్ విండో విధానం అమల్లోకి రానున్న దృష్ట్యా ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. జిల్లాలోని 556 గ్రామపంచాయతీలకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరిచి, టీఎస్-బీపాస్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు చలాన్ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మాదిరిగానే గ్రామపంచాయతీల్లోనూ దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల ద్వారా అన్ని రకాల ధ్రువపత్రాలు, ఇంటి ప్లాన్ పొందుపర్చి టీఎస్-బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత శాఖల అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అధికారుల పరిశీలన అనంతరం 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది. అన్ని ధ్రువపత్రాలు సరిగ్గా లేనట్లయితే సంబంధిత దరఖాస్తులను తిరస్కరిస్తారు.