సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ): ఎట్టకేలకు రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన బడ్జెట్‌ను ఖరారు చేశారు. రూ. 8,440 కోట్లతో తాజా ముసాయిదాను సిద్ధం చేసిన ఫైనాన్స్ విభాగం అధికారులు సోమవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు.
ఆదాయానికి, వ్యయానికి పొంతన లేదని గత స్టాండింగ్ కమిటీ సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. బడ్జెట్ పారదర్శకంగా ఉండాలని సభ్యుల సూచనల మేరకు మార్పులు చేశారు. రూ. 8340 కోట్లతో రూపొందించిన బడ్జెట్ సభ్యుల సూచనల మేరకు బడ్జెట్‌ను రూ. 100కోట్ల మేర పెంచి రూ. 8440 కోట్లుగా బడ్జెట్‌ను సిద్ధం చేశారు. బల్దియాకు ఆదాయాన్ని సమకూర్చే ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, ఎస్టేట్స్, ప్రకటనల నుంచి రావాల్సిన రెవెన్యూ సక్రమంగానే చూపించారా? లేదా అన్నది ఈ స్టాండింగ్ సమావేశంలో తేలనున్నది.
హెచ్ సిటీ ప్రాజెక్టులకు రూ. 1237 కోట్లు, రహదారులకు రూ. 650 కోట్లు, సమగ్ర రోడ్డు నిర్వహణకు రూ. 185కోట్లు, నాలాలు, డ్రైయిన్లు రూ. 200 కోట్లు పార్కులు, పచ్చదనానికి రూ. 208 కోట్లు, చెరువులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు రూ. 173, అప్పులు రూ. 1933కోట్లు, ఇంకుడు గుంతలకు రూ. 72కోట్లు, ఇంజినీరింగ్ నిర్వహణ పనులకు రూ. 314, హెల్త్ శానిటేషన్ విభాగానికి రూ. 600కోట్లు కేటాయించారు. హౌసింగ్‌కు రూ. 300కోట్లు కేటాయింపులు జరిపారు.
రెవెన్యూ వ్యయంలో రూ. 64 కోట్లు, క్యాపిటల్ వ్యయంలో రూ. 36 కోట్లు పెంచి సవరణ బడ్జెట్‌ను రూ.100కోట్లు పెంచారు. సవరణలో భాగంగా ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్, ట్రేడ్ లైసెన్స్, ప్రకటనలు ఫీజుల ద్వారా దాదాపు రూ. 228 కోట్లు ఆదాయం అదనంగా చూపారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను రూ. 419 కోట్ల నుంచి రూ. 279 కోట్లకు తగ్గించారు. కూడికలు, తీసివేతలతో మొత్తంగా రూ. 100కోట్లు పెంచారు.