మా అమ్మ ప్రోత్సాహం మరువలేనిది.. సృష్టికి మూలం అమ్మ.. పుట్టిన బిడ్డను గుండెలకు హత్తుకుని మురిసిపోయేది అమ్మ.. అనురాగం, ఆప్యాయతను పంచేది అమ్మ.. ప్రేమకు తొలి చిరునామా అమ్మ.. అమ్మ పిలుపులో కమ్మదనమున్నది.. అందరి మనసుల్లో అమ్మకే అగ్రస్థానం… అమ్మ అనే పదంలో అమృతమున్నది. జీవితాన్నే వరంగా ఇచ్చిన అమ్మకు ఏమిచ్చినా, ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిది.. పూదోటలాంటి అమ్మ మనస్సు నిత్యం బిడ్డల క్షేమాన్ని కోరుకుంటుంది..
ఎంత కష్టమొచ్చినా కడుపులో దాచుకుని ప్రేమను పంచే గొప్ప కరుణామయి అమ్మ.. అందుకే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు పెద్దలు.. స్వచ్ఛమైన, నిర్మలమైన మనసు ఉన్న కనిపించే దైవం అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు జన్మనిచ్చి చివరి క్షణాల వరకు ప్రేమానురాగాలు పంచే అమ్మను వృద్ధాప్యంలో వదిలేయకుండా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. నేడు మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ వందనం..
– వికారాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కనిపించే దైవం అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ.. అలుపెరుగని ఓర్పు అమ్మ.. అమ్మే అందరికీ మొదటి గురువు. అమ్మ పేరులో ప్రేమని, పిలుపులో మాధుర్యాన్ని నింపుకొన్న మాతృమూర్తీ. ఎన్ని కష్టాలొచ్చినా పిల్లలకు మాత్రం తన కష్టం వెనుక కన్నీటిని తెలువకుం డా ప్రేమను పంచుతూ పెంచుతుంది. తాను పస్తులుండి…పిల్లలకు గోరు ముద్దలు తినిపించి ఆ ప్రేమతోనే కడుపు నింపుకొంటుంది.
అమ్మకు త్యాగం, కష్టం మాత్రమే తెలుసనేలా తన పిల్లలు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే గొప్ప త్యాగశీలి. ఈ విధంగా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కు వే. అమ్మ రుణం తీర్చుకోలేనిది.. ప్రపంచంలో తీర్చుకోలేని రుణమంటూ ఉంటే అది ఒక్క అమ్మ రుణమే. మనల్ని ఎన్నో కష్టాలు ఓర్చి కని పెంచిన అమ్మలను చివరి క్షణాల్లో కష్టాల కడలిలో వదిలేయకుండా అమ్మ పంచిన ప్రేమలో కొంతైనా ఇచ్చేలా ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేడు మదర్స్ డే సందర్భంగా…అమ్మలందరికీ వందనం..
అమ్మ రుణం తీర్చుకోలేనిది..
మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కుటుంబాన్ని అన్నీ తానై చూసుకున్నది. నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో నాన్నగారు మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మే మా కుటుంబ బాధ్యతల్ని మోసింది. మమ్మ ల్ని పెంచడంలోనూ, చదివించడంలోనూ అమ్మ చాలా కష్టాలు పడ్డది. అమ్మ రుణం తీర్చుకోలేనిది.
– నారాయణ రెడ్డి, వికారాబాద్ కలెక్టర్
మా అమ్మ ప్రోత్సాహం మరువలేనిది..
మా నాన్న ఉపాధ్యాయుడు కావడంతో వృత్తిరీత్యా బిజీగా ఉండేవారు. దీంతో చిన్నతనం నుంచే మా అమ్మ నన్ను, నా సోదరులను అన్ని విధాలా చూసుకునేది. నేను పెద్ద చదువులు చదివి.. ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించేది. మా నాన్న నన్ను టీచర్ ట్రైనింగ్‌లో జాయిన్ చేశారు. ఆరు నెలలపాటు శిక్షణ తీసుకున్నా. అయితే మా నాన్నతోపాటు ఇద్దరు బావలు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో నాకు టీచర్‌గా కొనసాగడం ఇష్టం లేదని అమ్మకు చెప్పడంతో ఎంసెట్ ఎంట్రెన్స్ రాసి సీటు వస్తే చదువుకోమని చెప్పి అమ్మ ప్రోత్సహించింది. మీ ముగ్గురు కొడుకులు గెజిటెడ్ అధికారులని ఓ సందర్భంలో మా ఇంటి పక్కనున్న ఓ పెద్ద మనిషి అన్న సమయంలో మా అమ్మ చాలా సంతోషించింది. మా అమ్మ ప్రో త్సాహం మరువలేనిది, అమ్మ రుణం తీర్చుకోలేది కాబట్టి మా అమ్మ చివరి క్షణం వరకూ ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాం.
– గోపాల్, వ్యవసాయాధికారి వికారాబాద్ జిల్లా
నా ఎదుగుదలకు నా తల్లే కారణం
నా స్వగ్రామం సూర్యాపేట జిల్లాలోని తిమ్మాపురం అనే మారుమూల గ్రామం. నా ఎదుగుదలలో మా అమ్మ పాత్రే కీలకం. మా అమ్మ కూలీ, నాలీ చేసి కష్టపడి నన్ను, నా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లను చదివించింది. అంతేకాకుండా కష్టపడి ఎదగాలని చెప్పేవా రు. నవమాసాలు మోసి, పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన అమ్మ సేవలు మరువలేనివి. తల్లి రుణాన్ని అందరూ తెలుసుకోవాలి. బతికున్నప్పుడు మనం ఇబ్బందులు పడినా అమ్మను మాత్రం ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవాలి.
– కోటాజీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి వికారాబాద్ జిల్లా