పరిగి, అక్టోబర్ 9 : బీఆర్ఎస్ పార్టీ అన్నదాతలకు అండగా ఉంటుందని, ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పాదయాత్రకు తరలివెళ్తున్న మాజీ మంత్రి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు పరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఫార్మాసిటీ పరిశ్రమలతో తమ పంటలకు నష్టం జరుగుతుందని రైతులు భయాందోళన చెందుతున్నారన్నారు. రైతులు ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.. కాబట్టే మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారన్నారు. ప్రజల కోసం పరిశ్రమలు పెట్టాలే కానీ.. ప్రజలు వద్దంటున్నా ఎందుకు పెడుతున్నారని, ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు పెడితే బాగుంటుందన్నారు.
ఫార్మా కంపెనీల వల్ల ఆ ప్రాంత గ్రామాలు కాలుష్యంతో నిండిపోయి పంటలు పండవని చెప్పారు. పోలీసులు సైతం శాంతియుతంగా కార్యక్రమం చేసుకోవచ్చని చెప్పడంతో ఆర్డీవో లేదా తహసీల్దార్‌కు మెమోరాండం ఇద్దామని రైతులు అనుకున్నారని తెలిపారు.
బూర్గుల రామకృష్ణారావు తర్వాత జిల్లాకు రెండో సారి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి అవకాశం దక్కిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జిల్లాలో కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఈ పరిశ్రమలు వద్దని చెబుతున్న రైతులను పిలిచి అనుమానాలు నివృత్తి చేయడం, లేదంటే పరిశ్రమల ఏర్పాటును విరమించుకుంటే బాగుండేదన్నారు. బలవంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఏమిటని, రైతులకు నష్టం కలుగకుండా చూడాలని సూచించారు.
పది గ్రామాల్లో 3వేల ఎకరాలు..
ఫార్మా కంపెనీల కోసం పది గ్రామాల్లోని 3వేల ఎకరాల భూమిని సేకరించాలని చూస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. తమ భూములు ఇవ్వబోమని, రైతులు ధర్నాలు, నిరాహారదీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఫార్మాకు వ్యతిరేకంగా శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించాలని వెళ్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యముంటే మంచి కంపెనీలు తీసుకురావాలని నరేందర్‌రెడ్డి సవాల్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో షాబాద్ మండలంలో 3వేల ఎకరాల భూమి సేకరించి బ్రహ్మాండమైన కంపెనీలు తీసుకొచ్చామన్నారు. ఈ కంపెనీల వల్ల 23వేల మందికి ఉపాధి లభిస్తున్నదన్నారు. కొడంగల్‌లో పచ్చటి పొలాల్లో కాలుష్యపు ఫార్మా కంపెనీలు తీసుకురావాలని చూస్తున్నారని విమర్శించారు. ఫార్మా కంపెనీల కోసం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో 14వేల ఎకరాల భూమిని సేకరించి, ప్రత్యేకంగా ఫార్మా కంపెనీలు పెట్టాలని జీవో తీశారని ఆయన గుర్తు చేశారు.
అక్కడ ఫార్మా కంపెనీలే పెట్టాలని, లేనిచో రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని జీవోలో స్పష్టంగా ఉన్నదన్నారు. అక్కడ సేకరించిన భూములు వదిలిపెట్టి పచ్చటి పొలాలున్న కొడంగల్‌లో రైతుల నోట్లో మట్టి కొట్టడానికి కాలుష్యపు కంపెనీలు ఏర్పాటు చేయాలని చూడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తమను అరెస్టు చేయించి పాదయాత్రను ఆపినంత మాత్రాన ఉద్యమం ఆగదని, అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ధర్నా చేస్తామన్నారు. కాలుష్యపు కంపెనీలైన సిమెంటు, ఫార్మా కంపెనీలను అడ్డుకుంటామన్నారు.
సీఎంకు దమ్ము, ధైర్యముంటే టెక్స్టైల్స్ కంపెనీలు తీసుకురావాలని, ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తమ పాదయాత్రను అడ్డుకుంటామని కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, మీ రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేయాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలలో సేకరించిన 14వేల ఎకరాల భూమి ఏమి చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్‌కు వాడుకొని, కొడంగల్‌లో 3వేల ఎకరాల్లో కాలుష్యపు కంపెనీలు వేస్తే ఎవరూ ఊరుకోరని, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.