దురదృష్టవశాత్తు ఇంటి పెద్ద అయిన రైతు మృతి చెందితే అతడి కుటుంబం వీధినపడకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబీమా పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రచారం నిర్వహించలేకపోయింది. ఫలితంగా రంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు ఈ పథకంలో చేరలేదు. ఈసారి కొత్తగా 9,855 మంది మాత్రమే బీమా పథకంలో చేరగా.. ఇంకా పథకానికి జిల్లాలో 1,15,790 మంది రైతులు దూరంగానే ఉన్నారు. రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారడం.. వ్యవసాయ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడంతోపాటు వానకాలం పంటల సాగు వివరాల నమోదు వంటి పనుల్లో బిజీగా ఉండడంతో పూర్తిస్థాయిలో రైతులను బీమా పథకంలో చేర్పించలేకపోయినట్లు తెలుస్తున్నది.
గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబీమా పథకం రైతు కుటుంబాలకు కొం డంత ధీమాను కల్పించిం ది. దురదృష్టవశాత్తు ఇంటి పెద్ద అయిన రైతు మృతి చెందితే అతడి కుటుంబం వీధినపడకుండా ఉండేలా రైతుబీమా పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు.18 నుం చి 59 ఏండ్ల వయసున్న ప్రతి రైతుకూ బీమా వర్తిస్తుంది. రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి 10 రోజుల్లోనే బీమా సొమ్ము రూ.5లక్షలు ఆ రైతు కుటుంబం ఖాతాలో జమఅవుతాయి. ప్రభుత్వమే రైతుకు ఎలాంటి ఖర్చులేకుండా ప్రీ మియం చెల్లిస్తున్నది. రైతులకు ధీమాగా ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు.. బీమా ప్రీమియం చెల్లింపునకు నిధులను కేటాయిస్తూ గత నెలలో ఉత్తర్వులను కూడా జారీ చేసింది. గతేడాది 1,97,216 మంది రైతులు బీమాలో నమోదుకాగా..వారందరికీ ఈసారి ఆటోమెటిక్‌గా రెన్యువల్ కానున్నది.
కొత్త బీమాకు దూరంగా లక్షకు పైగా రైతులు..
గతంలో బీమాకు దరఖాస్తు చేసుకోలేకపోయిన రైతులతోపాటు ఈ ఏడాదిలో జరిగిన భూముల క్రయ, విక్రయాల ద్వారా కొత్తగా జారీ అయిన పాస్ పుస్తకాలకు సంబంధించిన రైతులకు కూడా రైతుబీమా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా..కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అయిన రైతులు జిల్లాలో 23,682 మంది వరకు ఉ న్నారు. ఐదెకరాల్లోపు భూమి కలిగిన 92,740 మంది రైతులతోపాటు, ఐదెకరాలకు మించి ఉన్న 9,223 మంది రైతు లు గతం నుంచీ వివిధ కారణాలతో బీమా పథకానికి దూ రంగా ఉంటున్నారు.
వీరికి ఆగస్టు 5వ తేదీలోపు ఈ పథకం లో తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా వారు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం గడువును మరో రెండు రోజులు పెంచినా రైతుల నుంచి ఆ శించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. అర్హులందరినీ రైతుబీమా పథకంలో చేర్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉండేది. అయితే రుణమాఫీ ప్రక్రియ గందరగోళానికి దారితీయడంతో రైతుల సం దేహాలను నివృత్తి చేసేందుకు..ఇక వానకాలానికి సంబంధించి పంటల సాగు వివరాలను పోర్టల్‌లో నమోదు చేసే ప్ర క్రియలో వారు బిజీగా ఉండడంతో రైతులను ఈ పథకంలో చేర్పించలేకపోయినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా ఈ స్కీమ్‌పై విస్తృతంగా ప్రచా రం చేయలేకపోయింది. ఈ కారణాలతోనే చాలామంది రైతులు బీమా పథకానికి దూరంగా ఉండిపోయారు.
బీమా పథకం వివరాలు..
కొత్తగా పాసు పుస్తకాలు జారీ అయిన రైతులు : 23,682
ఐదెకరాలకు లోపు ఉన్న వారు : 92,740
ఐదెకరాలకు పైబడి ఉన్న రైతులు : 9,223
గతంలో బీమాలో చేరి రెన్యువల్ కానున్న రైతులు : 1,97,216
ఈసారి కొత్తగా బీమాకు దరఖాస్తు చేసుకున్న రైతులు : 9,855
మండలాల వారీగా పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు
మండలం : – రైతులు
ఆమనగల్లు : 531
కడ్తాల్ : 487
మాడ్గుల : 1,042
తలకొండపల్లి : 827
చేవెళ్ల : 616
మొయినాబాద్ : 250
షాబాద్ : 537
శంకర్పల్లి : 445
అబ్దుల్లాపూర్‌మెట్ : 132
హయత్ నగర్ : 000
ఇబ్రహీంపట్నం : 340
మంచాల : 649
యాచారం : 537
బాలాపూర్ : 009
కందుకూరు : 502
మహేశ్వరం : 180
సరూర్ నగర్ : 000
గండిపేట : 027
రాజేంద్ర నగర్ : 000
శేరిలింగంపల్లి : 000
శంషాబాద్ : 246
ఫరూఖ్ నగర్ : 725
చౌదరిగూడెం : 381
కేశంపేట : 623
కొందుర్గు : 284
కొత్తూరు : 251
నందిగామ : 234
మొత్తం : – 9,855