అమ్మనాన్నల గొప్పతనాన్ని అనేక మంది.. అనేక రకాలుగా చెప్పారు.. కానీ వారిని గొప్ప వారిగా తీర్చిదిద్దిన వాళ్ల అమ్మనాన్నలు.. మరింత గొప్పవారే. వృద్ధాప్యంలోనూ కొడుకు, కూతుళ్లకు సూచనలు, సలహాలిస్తూ.. మనవళ్లు మనవరాళ్లకు సర్వస్వంగా మారిపోతున్నారు. ఇప్పుడు ఎక్కువగా భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ ఉండడంతో పిల్లలు స్కూల్నుంచి రావడంతోనే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ఒడిలోకి చేరుతున్నారు. పిల్లలకు ఆసక్తి కలిగించేలా కథలు చెబుతూ అందులోని నీతిని వివరిస్తూ, నడవడిక నేర్పిస్తున్నారు. ఉద్యోగరీత్యా పట్టణాల్లో ఉంటున్నవారు కూడా వారాంతల్లో సొంత ఊళ్లకు వెళ్లడం ఇటీవల బాగా పెరిగింది. దీంతో మనవళ్లు, మనవరాళ్లతో తాతయ్య, నానమ్మల బంధం మరింత బలపడుతున్నది. వాళ్ల గొప్పతనాన్ని మళ్లీ గుర్తుచేసుకోవడం కోసమే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న గ్రాండ్ పేరెంట్స్‌డే జరుపుకొంటున్నారు.
– పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 9
‘టీచర్ మీరు గుణింతపు గుర్తులు చెప్పకుండా నేరుగా పదాలు చెప్తే పిల్లలు ఎలా రాస్తారు? వాళ్లకు ఏం అర్థమవుతుంది? చెప్పే విధానం అది కాదు కదా! పద్ధతి ప్రకారం చెప్తేనే పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు’.. ఆన్లైన్ క్లాస్ వింటున్న ఒకటో తరగతి చదివే మనవరాలి పక్కన కూర్చున్న ఓ నాయినమ్మ.. తెలుగు టీచర్‌ను అడిగిన ప్రశ్న ఇది..‘అరేయ్.. ఎక్కడికి వెళ్తున్నావ్. రాత్రి ఎందుకు లేట్ అయ్యింది. ఆ దోస్తాన్ వద్దు బిడ్డా. నా మాట విను. ఆళ్లతోటి తిరిగితె చెడిపోతవ్రా.!’ ఓ మనవడితో తాత మాట ఇది..
సుద్దులు చెప్పే అమ్మమ్మలు.. చెడుతోవలు పట్టకుండా చూసే తాతలు. ఇదీ పెద్దలంటే. (సెప్టెంబర్ రెండో ఆదివారం) ఆదివారం గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
పిల్లలకు బంగారు బాట చూపడంలో, ఏది తప్పు, ఏది ఒప్పు అని సరిచేయడంలో గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. కండ్ల ముందు పిల్లలు పెడదోవ పడుతున్నట్టు ముందే గుర్తించడంలో వాళ్లే ముందు వరుసలో ఉంటారు. ‘అది మంచిది కాదు బిడ్డా.. జాగ్రత్త’ అని మేలుకొలుపు హెచ్చరికలు చేస్తుంటారు. అందుకే మన తాత, నాన్నమ్మ, అమ్మమ్మలకు జేజేలు.
పిల్లలపై కన్నేసి..
‘అత్తామామలు ఏం పనిచేస్తారు? తిని ఇంట్లోనే టీవీల ముందు కూర్చుంటారు’ పక్కింటి వాళ్లతో ఓ కోడలి మాట ఇది. కానీ, అది వాస్తవం కాదంటున్నారు మానసిక నిపుణులు. గ్రాండ్ పేరెంట్స్.. పిల్లల ప్రవర్తనపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. వాళ్లను చాలా దగ్గరనుంచి పరిశీలిస్తారు. ప్రతి కదలికను పట్టి పట్టి చూస్తారు. అందుకే పిల్లల్లో కలిగే విపరీత ఆలోచనలను ముందే గుర్తిస్తారు. వెనువెంటనే సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. చెడుదోవలో పోతే కలిగే అనర్థాలు, ఎదురయ్యే ఇబ్బందులను ఉదాహరణలతో వివరిస్తారు. స్వఅనుభవాలను కండ్లకు కట్టినట్టు ఉదహరిస్తూ సూచనలు చేస్తారు. గతంలో అలా పెడదోవ పట్టి, నష్టపోయినవారి గురించి వివరిస్తూ.. మంచి బాటలో నడిచేందుకు సలహాలు ఇస్తున్నారు. పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. నీతి కథలు చెబుతున్నారు. పురాణ ఇతిహాసాలు చెప్తూ.. అవి నిత్య జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతాయో ఉదాహరణలతో చెబుతున్నారు.
పెద్దలు అక్కడ.. పిల్లలు ఇక్కడ
ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల చదువుల పేరుతో తల్లిదండ్రులు పట్టణాల బాట పడుతుండడంతో పిల్లలకు మంచి, చెడులు చెప్పేవారు కరవయ్యారు. పిల్లలు పెడదోవ పట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. ఉద్యోగాల పేరుతో నేటి యువ తల్లిదండ్రులు ఎక్కువగా పట్టణాలకు పయనమవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లలు ఒకచోట వుండే పరిస్థితి నెలకొంటే.. ఉన్న ఊరిని విడిచి పెట్టి పట్టణాలకు రాలేక.. తాత, నాన్నమ్మ, అమ్మమ్మలు ఊర్లలో ఉండిపోతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వారాంతాలలో స్వంత గ్రామాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్నది. పండుగలు, ఇతరత్రా వేడుకల సమయంలో తాత, నాన్నమ్మ, అమ్మమ్మలు మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతున్నారు. మంచి, చెడుతో పాటు నీతి కథలతో దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు గ్రాండ్ పేరెంట్స్.