రంగారెడ్డి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలనకు పెద్దపీఠ వేస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సహకార సంఘాల చైర్మన్లను అక్రమ మార్గంలో తొలగిస్తున్నది. అధికార పార్టీలో ఉంటేనే చైర్మన్లుగా కొనసాగుతారని.. బీఆర్ఎస్లో ఉన్న వారి పదవులను తొలగించి వారి స్థానాల్లో కొత్త వారి ని నియమిస్తామని బాహాటంగా ప్రకటించిన ప్రభుత్వం అన్నంత పని చేసింది. తమకు పదవులు ముఖ్యం కాదు.. పార్టీయే ముఖ్యమన్న జిల్లాలోని తొమ్మిదిమంది బీఆర్ఎస్ చైర్మన్లను తొలగించి.. వారి స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన డైరెక్టర్లను దొడ్డిదారిన చైర్మన్లుగా నియమించింది. తమను తొలగించడాన్ని సవాల్‌చేస్తూ బీఆర్ఎస్కు చెందిన చైర్మన్లు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా వారినే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినా.. రాజకీయ ఒత్తిళ్ల మధ్య వారికి నిరాశే మిగిలింది.
జిల్లాలో గత బీఆర్ఎస్ హయాంలో 2020 ఫిబ్రవరి 15న 37 మంది సహకార సంఘాల చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వారి పదవీకాలం ముగిసినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో మొదట వారినే ఆరు నెలలపాటు కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. ఆ గడువు తేదీ కూడా ముగిసిన తర్వాత తిరిగి రెండోసారి కూడా వారినే కొనసాగించాలని సర్కార్ మరోసారి ఉత్తర్వులను జారీచేసింది. కాగా, కొంతమంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సహకార సంఘాల చైర్మన్లను ఏకపక్షంగా తొలగించి.. వారికి అనుకూలంగా ఉన్న వారిని చైర్మన్లుగా నియమించుకుంటున్నారు.
గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు లేకపోవడంతో ప్రొటోకాల్ వ్యవహారంలో మండలస్థాయిలో పీఏసీఎస్ చైర్మన్లు కీలకంగా మారారు. ఇది ప్రభుత్వ పెద్దలకు నచ్చడంలేదు. పీఏసీఎస్‌లలో అత్యధికంగా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వారే ఉండడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జీలు సూచించిన వారికే చైర్మన్ పదవులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీం తో జిల్లాలో 9 మంది బీఆర్ఎస్కు చెందిన చైర్మన్లను ఏకపక్షంగా తొలగించడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆర్డర్లూ బలాదూర్..
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మమ్మల్ని ఏ కారణం లేకుండానే తొలగించారని.. తమతోపాటు ఎన్నికైన కాంగ్రెస్‌కు చెందిన వారిని మాత్రం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బాటసింగారం, మహేశ్వరం, కందుకూరు, ఎంపీ పటేల్‌గూడ, ఆర్కేమైలారం వంటి సహకార సంఘాల చైర్మన్లు కోర్టును ఆశ్రయించారు. బాటసింగారం సహకార సంఘం చైర్మన్‌గా కొనసాగుతున్న అతడిని పలు కారణాలు చెబుతూ సస్పెండ్ చేయగా.. వెంటనే అతడు కోర్టును ఆశ్రయించి చైర్మన్‌గా కొన సాగేందుకు ఆర్డర్ తెచ్చుకున్నాడు.
అయినా అధికారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన పదవీకాలాన్ని మాత్రం పొడిగించలేదు. అధికారులపై ఆయన కోర్టు ధిక్కరణ కేసు వేయగా.. ఆయన స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన మరో డైరెక్టర్‌కు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. కోర్టు ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నదని సహకార సంఘానికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే, మహేశ్వరం, కందుకూరు సహకార సంఘాల చైర్మన్లు కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారినే కొనసాగించాలని చెప్పినా వారి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లను చైర్మన్లుగా నియమించింది.
జిల్లాలో 37 మంది సహకార సంఘాల చైర్మన్లు..
జిల్లాలో 37 మంది సహకార సంఘాల చైర్మన్లు ఉన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో 2020 ఫిబ్రవరిలో సహకార సంఘాలకు ఎన్నికలు జరుగగా .. మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకున్నది. డీసీసీబీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పలువురు చైర్మన్లు, వైస్ చైర్మన్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అందులో భాగంగానే డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య హస్తం గూటికి చేరారు. కాగా, జిల్లాలో ని పలువురు పీఏసీఎస్ చైర్మన్లు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. అందులో భాగంగానే బీఆర్ఎస్లో ఉన్న ఎంపీ పటేల్‌గూడ, ఆర్కేమైలారం, మాడ్గుల, ఆమనగల్లు, బాటసింగారం, యాచారం, కందుకూరు, పాలమాకుల, మహేశ్వరం సహకార సంఘాల చైర్మన్లను కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించింది. వారి స్థానాల్లో తమ పార్టీకి చెందిన డైరెక్టర్లను చైర్మన్లుగా నియమించింది.