రంగారెడ్డి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రుణమాఫీలో నేటికీ అడుగడుగునా చిక్కులే ఎదురవుతున్నాయి. జిల్లాలో రుణమాఫీ కోసం లక్షల్లో రైతులు ఎదురు చూస్తుండగా.. కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఫలితం దక్కింది. తొలి విడుతలో రూ.లక్షలోపు రుణం తీసుకున్నవారి పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో చాలామంది బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇదీ కొనసాగుతుండగానే.. రెండో విడుతలో రూ.లక్షన్నర రుణం ఉన్న రైతులకు మాఫీ చేశారు. ఇందులో కూడా చాలా మందికి మాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మాఫీ ప్రక్రియ ఏ ప్రాతిపదికన చేపట్టారో తెలియక చాలామంది రైతులు ఇప్పటికీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఖాతాల్లో జమకాని రూ.1.50 కోట్ల మాఫీ డబ్బులు..
రెండు విడుతల తర్వాత కూడా రుణమాఫీకి సంబంధించి సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి స్పష్టమైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. ప్రభుత్వం రూపొందించిన ఉత్తర్వుల మేరకు పట్టా పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ తొలి విడుతలో రూ.లక్ష వరకు, రెండో విడుతలో రూ.లక్షన్నర వరకు మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలి. కానీ బ్యాంకులు పంపిన జాబితాలో ఉన్న రైతుల్లో చాలామందికి మాఫీ జమకాకపోవడంపై గందరగోళం నెలకొన్నది.
ఇందుకు అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. ఖాతాల్లో పేర్లకు, ఆధార్‌కు మధ్య తేడా కారణంగానే మాఫీ డబ్బులు జమకాలేదని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డులో పేరులేకపోతే కూడా రుణమాఫీ డబ్బులు పడలేదు. దీంతో జాబితాలో పేరున్న రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాలేదు. మొదటి విడుతలో 1,502 మంది రైతులకు సంబంధించి రూ.28కోట్లకు పైగా మాఫీ డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. సంబంధిత రైతుల వివరాలను సేకరించి రాష్ట్రస్థాయి అధికారులకు పంపించామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
కానీ ఇప్పటివరకు ఎంత మంది రైతులకు న్యాయం జరిగిందో స్పష్టత లేదు. ఇక రెండో విడుతలోనూ 194 మంది రైతులకు సంబంధించి రూ.1.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉన్నది. వివిధ కారణాలతో జమకాలేదని అధికారులు చెబుతున్నారు. జాబితాలో పేరు వచ్చినప్పటికీ ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ కాకపోవడంపై రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొన్నది.
రైతులకు పరిష్కారం కరువు..
రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,700 మంది రైతులకు రూ.258.18 కోట్ల రుణమాఫీ, రెండో విడుతలో 22,915 మంది రైతులకు రూ.218.12 కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. అయితే అంకెలు మారాయి కానీ మాఫీ విషయంలో మాత్రం అందరి వెతలు ఒకేలా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. రుణమాఫీపై సందేహాల నివృత్తికి కలెక్టరేట్, మండలాల్లోనూ గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు. మాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలిపేందుకు యాప్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. అధికారులు సమస్యను నమోదు చేసుకోవడం తప్ప..
పరిష్కారం చూపడం లేదు. దీంతో బాధిత రైతులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే అధికారులు రుణమాఫీకి సంబంధించి అటు బ్యాంకుల్లో, ఇటు వానకాలం పంటల పరిశీలన, నమోదు కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో రైతులకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఇదిలాఉండగా రుణమాఫీ అయినవాళ్లూ మిత్తి పైసలు కట్టేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వడ్డీ కడితేనే మాఫీ అని బ్యాంకులు తెగేసి చెప్పడంతో దిక్కులేక కొత్తగా అప్పు తెచ్చి మరీ కడుతున్నారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక.. ఫిర్యాదు చేసినా పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం లేక రైతులు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
రుణమాఫీ చేస్తూనే కోతలు విధిస్తున్నది..
కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నామని చెబుతూనే మరో వైపు కోతలు విధిస్తున్నది. నేను బ్యాంకులో రూ. 1.43 లక్షల క్రాప్ లోను తీసుకున్నా. ప్రభుత్వం నాకు 1.43 లక్షల రుణమాఫీ చేసినట్లు జాబితాలో పేరు వచ్చింది. కానీ రుణానికి సంబంధించిన వడ్డీ డబ్బులు రూ. 4337లు తిరిగి చెల్లించమని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో నేను ఆ డబ్బులను తిరిగి చెల్లించాను. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ఈ ప్రభుత్వం వడ్డీల రూపంలో రైతుల వద్ద మళ్లీ డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం. ఎంతోమంది రైతులు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.
– గంగిడి భూపాల్‌రెడ్డి, హైతాబాద్, షాబాద్ మండలం