స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలన్నీ మనమే గెలవాలని.. భవిష్యత్తులో వచ్చేది మన గవర్నమెంటేనని పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో మనమే గెలుపొందాలని తెలిపారు. రాష్ట్రస్థాయి నాయకుడైనా సరే బూత్‌లో మెజార్టీ తెచ్చుకునేలా కృషి చేయాలని తెలిపారు. ఎక్కడ ఓడిపోయామో అక్కడే విజయం కోసం పరితపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 42 శాతం కంటే ఎక్కువ సీట్లను బీసీలకే కేటాయిస్తామని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గంలోని పూడూరు, పరిగి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
– పరిగి, ఆగస్టు 7
పరిగి నియోజవర్గంలో కోల్పోయిన అభ్యర్థులను మళ్లీ గెలిపించుకొని సత్తా చాటుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటల్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్‌రెడ్డి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేశారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేశ్‌రెడ్డి కూడా ప్రతి ఊరూ తిరిగి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారన్నారు. రాష్ట్రస్థాయి నాయకుడైనా తానుండే పోలింగ్ బూత్‌లో మెజార్టీ దిశగా అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలిపారు. అలాంటివారినే దార్కారి లీడర్ అని ఒప్పుకొంటానని కేటీఆర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తామని, బీసీలకు 42 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు.
పార్టీ అభ్యర్థులకు ప్రచార సామగ్రితోపాటు సహకారం అందిస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుందని, రెండు పార్టీలకు మూడు చెరువుల నీళ్లు తాగించి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ర్టాన్ని కాపాడుకుందామని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉండేదని, ఈరోజు వికారాబాద్‌లో కూతవేటు దూరంలో కలెక్టరేట్ ఉందని, ఇవన్నీ కేసీఆర్ చేశారన్నారు. పరిగి నియోజకవర్గంలో కొత్తగా మహ్మదాబాద్, చౌడాపూర్ మండలాలను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.
ఈ స్థానిక ఎన్నికల గండం దాటితే రైతు బంధు ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నిసార్లు రైతులకు డబ్బులు వేసినా కేసీఆర్‌కే పేరు వస్తుందని, అందువల్ల రైతు బంధు ఎత్తివేసే అంశంపై కేబినెట్లో చర్చ జరిగిందని, స్థానిక ఎన్నికల తర్వాత ఎత్తివేసేందుకు డిసైడ్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన కలెక్టరేట్లు ఉన్నట్లు కొన్ని రాష్ర్టాలో సెక్రటేరియేట్లు కూడా ఉండవని స్వయంగా నేటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారన్నారు. కొడంగల్‌లో సైతం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. చేసినవి చెప్పుకోలేకనే గత ఎన్నికల్లో తక్కువ మార్జిన్‌తో ఓటమిపాలయ్యామని పేర్కొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నారని ఎవరిని అడిగినా తెలుస్తుందని, స్పీకర్‌కు మాత్రం అర్థం కావడం లేదని, శోధించి, పరిశోధించి చెబుతారంట అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ప్రారంభించిన పరిగి నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పాదయాత్ర ప్రారంభమైన పరిగి, పూడూరు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. జన హిత పాదయాత్రను ప్రారంభించి వారం తిరక్కుండానే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగడం రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట అధికార పార్టీకి పెద్ద షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మూడేళ్లకు పైగా అధికారాన్ని వదులుకొని అధికార పార్టీ నుంచి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో చేరడం కొత్త సంప్రదాయానికి తెరతీసింది.
బీఆర్ఎస్లోకి ఇప్పుడే వలసలు ప్రారంభమయ్యాయంటే మున్ముందు మరిన్ని ఉంటాయని చెబుతున్నారు. కొందరిని పార్టీ మారకుండా ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ వారు బీఆర్ఎస్లో చేరడం గమనార్హం. భారీ సంఖ్యలో వలసలతో బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నింపింది. మరోవైపు రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా కల్పించడం గులాబీ శ్రేణుల్లో మరింత మనోధైర్యాన్ని నింపింది.
కేటీఆర్ సమక్షంలో.. మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పూడూరు మండలంలోని పీఏసీఎస్ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ తాజుద్దీన్, మాజీ సర్పంచ్‌లు గోపాల్, శంకరయ్య, బాలు, నిర్మల, నాయకులు మహిపాల్‌రెడ్డి, బాలు, పరిగి మండలం బసిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సూరప్ప, పెద్ద మాదారం, మాదారం నాయకులు సత్యనారాయణరెడ్డి, ఎ.గోపాల్, మహిపాల్‌రెడ్డి, జంగయ్య, నారాయణ, నరేష్‌లతోపాటు సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, పరిగి, పూడూరు మాజీ ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, సీనియర్ నాయకులు మేడిద రాజేందర్, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మీర్ మహమూద్‌అలీ, సయ్యద్‌పల్లి వెంకటయ్య, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను చూడగానే కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారని, ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ కేసీఆర్‌ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఈన్నారు. హరీశ్వర్‌రెడ్డి ఉన్నపుడు పరిగి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశారో.. అలాగే మహేశ్‌రెడ్డి కూడా అభివృద్ధిని యజ్ఞంలా భావించి పనిచేశారన్నారు. మహేశ్‌రెడ్డి ఓడిపోతారని ఎవరూ కలలో కూడా అనుకోలేదన్నారు.
రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వే, కేసీఆర్‌వే అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని పేద వారికి కేసీఆర్ అండగా నిలిచారన్నారు. అనేక గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేశారన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అని కాంగ్రెస్ వాళ్లు అంటుంటే, ఉండదమ్మా రాజ్యం పోతదని ప్రజలు అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన జన హిత పాదయాత్ర పోలీసుల వలయంలో కొనసాగిందని, కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజలు ఒక్కరూ లేరని.. అది జన రహిత పాదయాత్ర అని విమర్శించారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికలకు బదులు అసెంబ్లీ ఎన్నికలు వస్తే బాగుండు గులాబీ జెండా ఎగురవేస్తామంటూ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఏ కార్యకర్తకూ ఇబ్బంది కలిగినా కేటీఆర్ అండగా నిలుస్తున్నారని, తన పుట్టినరోజును సైతం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జైలులో పెట్టిన కార్యకర్తతోనే జరుపుకొన్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ను ఖతం చేయాలనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన సర్కారు చేయడం లేదన్నారు. ఎవరు మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారని పేరొన్నారు. కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, నాయకులున్నారు.