రంగారెడ్డి, ఆగష్టు 18 (నమస్తేతెలంగాణ) : ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల పేరుతో నాలుగైదింటిని ఒకేచోట ఏర్పాటు చేసే ప్రయత్నాలపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. నాలుగైదు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటుచేస్తూ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలుగా ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యాలయాలు దూరం కానున్నాయి.
ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ భూముల మార్కెట్ విలువలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేస్తూ ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే గచ్చిబౌలిలో నిర్మించనున్న కార్యాలయంతో పాటు చుట్టుప్రక్కల ఉన్న గండిపేట్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా గచ్చిబౌలిలోనే ఏర్పాటు కానున్నాయి. అలాగే మహేశ్వరం మండలంలోని మంఖాల్ వద్ద నిర్మించనున్న భవనంలోకి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్ కార్యాలయాలు వెళ్లనున్నాయి.
కోహెడ వద్ద నిర్మించనున్న భవనంలో అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్, హయత్‌నగర్ వనస్థలిపురం కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలంయలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల మండలాలకు సంబంధించిన ప్లాట్ల క్రయవిక్రయాలు, మ్యారేజ్ సర్టిఫికెట్లు, భూముల వాల్యువేషన్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు.
ఈ కార్యాలయాలు మంఖాల్‌లో ఏర్పాటు చేస్తే లోయపల్లి నుంచి మంఖాల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వెళ్లే వరకు ప్రజలకు వ్యయ ప్రయాసలు తప్పవు. అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మరోచోటుకు తరలించటం సమంజసం కాదని పలువురు వాపోతున్నారు. ఔటర్ చుట్టూ ఉన్న 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను మూడుచోట్లనే ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఉన్న కార్యాలయాలను దూర ప్రాంతాలకు తరలించటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రంగారెడ్డిజిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యాలయానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గచ్చిబౌలిలో జిల్లా రిజిస్ట్ట్రార్ కార్యాలయంతో పాటు గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సబ్‌రిజిస్టార్ కార్యాలయాలను కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు.