ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 22 : షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు సబ్సిడీ ప్రోత్సాహకాలను అందించాలని రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరి అన్నా రు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో టీఎస్ఐపాస్ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ టీప్రైడ్ కింద షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు సబ్సిడీ ప్రోత్సాహంగా ఇచ్చే పథకాలు, అదేవిధంగా షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులకు ఇచ్చే పథకాలపై సమీక్ష నిర్వహించారు. టీప్రైడ్, టీ ఐడియా పథకాల కింద షెడ్యూల్ కులాల లబ్ధిదారుల కేటగిరీలో ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌కు సంబంధించి వచ్చిన దరఖాస్తులు.. అలాగే, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల కింద వచ్చిన దరఖాస్తులకు కమిటీ అనుమతులు ఇచ్చింది. ఇయా పథకాల కింద యూనిట్లు పొందిన లబ్ధిదారులు వాటిని నిరంతరం నడుపుకొనేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి..
2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి హరితహారం భవిష్యత్ కార్యాచరణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ భారతి శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే మూ డేండ్లకు ప్రభుత్వం హరితహారంలో జిల్లాకు నిర్దేశించే లక్ష్యాలను పూర్తిచేసేలా సం బంధిత శాఖల అధికారులు కృషిచేయాలన్నారు. ప్రతి శాఖకూ నిర్దేశించిన లక్ష్యాన్ని పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించడంతోపాటు గుంతల తవ్వకం పనులను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అటవీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, విద్యాశాఖల అధికారులు సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, సుశీందర్‌రావు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.