వికారాబాద్, సెప్టెంబర్ 17 : ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, భారత స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ నాయకులు పాల్గొని బ్రిటిష్ వారి నుంచి భారత జాతిని విముక్తి చేశారన్నారు. ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాలలో మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రానికై పోరాడుతూనే ఉన్నారని సభాపతి తెలిపారు.
జిల్లాలో 235 కోట్ల రూపాయల వ్యయంతో వికారాబాద్ మెడికల్ కళాశాల, కొడంగల్‌లో 125 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వికారాబాద్‌లో నూతన జిల్లా ఆసుపత్రిని ప్రారంభించగా, పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల ఆస్పత్రి నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుందన్నారు.
ఇది కేవలం ప్రణాళిక కాదు.. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సారథి కళాకారులు ఆలపించిన గేయాలు ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థినులకు స్పీకర్ జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు శాసనసభ్యుడు మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, బీసీసీబీ డైరెక్టర్ కిషన్‌నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులున్నారు.