మొయినాబాద్ : ఎన్కేపల్లి భూములను ప్రభుత్వం గోశాలకు ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ కొందరు రైతులు రిలే దీక్షలు చేపట్టగా.. మరికొందరికి మంగళవారం అధికారులు పట్టాలను పంపిణీ చేశారు. ఎకరానికి 500 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని భూ బాధితులు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు 300 గజాల చొప్పునే ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలను తీసుకున్నారు. అడిగింది ఇవ్వం.. ఇచ్చిందే తీసుకోవాలి అన్న విధంగా అధికారులు వ్యవహరిస్తుండడంతో ఆగ్రహం చెందిన భూబాధితులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పొలా ల నుంచి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆందోళనను నీరుగార్చేందుకు మాజీ సర్పంచ్ అమర్నాథ్రెడ్డి రైతులను విడదీసి కొంతమందికి పట్టాలను పంపిణీ చేయిస్తున్నారని వారు ఆగ్రహం చెంది హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఉన్న అమర్నాథ్రెడ్డి కారుపై రైతులు దాడి చేసి ధ్వంసం చేశారు. అదేవిధంగా పట్టాల పంపిణీని ముగించుకుని ఎమ్మెల్యే యాదయ్య మండల పరిషత్ కార్యాలయం నుంచి బయటికి వెళ్దామనుకునే సమయంలో అన్ని గేట్ల వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు.
గేట్‌కు అడ్డుగా ఉండకుండా పోలీసులు వారిని అక్క డి నుంచి పంపించి వేయగా.. హైదరాబాద్-బీజాపూర్ జాతీ య రహదారిపై బైఠాయించి ఆందోళన చేసేందుకు యత్నిం చగా పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఆడామగా అని చూడకుండా అందర్ని అరెస్టు చేసి పోలీస్ వ్యాన్‌లో ఎక్కించి శంకర్పల్లి ఠాణాకు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
అనంతరం పోలీసులు ఎమ్మెల్యే కారును కార్యాలయం నుంచి బం దోబస్తు మధ్య పంపించారు. రైతులు, చిన్నారులను పోలీసులు అరె స్టు చేసి ఠాణాకు తరలిస్తుండగా అక్కడే ఉన్న కొందరు మహిళలు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసుల కాళ్లపై పడి తమ పిల్లలను వదిలిపెట్టాలని వేడుకున్నారు. రైతుల మధ్య ఐక్యతను దెబ్బ తీసేలా.. కొందరికి మాత్రమే పట్టాలను పంపిణీ చేసినందుకు ఎమ్మె ల్యే, అధికారులపై మహిళలు మండిపడ్డారు. శాపనార్థాలు పెట్టారు.