బొంరాస్‌పేట, చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 2 : మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నాం. వినాయకచవితి పండుగ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది గణపతి ప్రతిమలు. వాడవాడలా, ఊరూరా, ఇండ్లల్లో వినాయకులను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తాం. అయితే ప్రకృతిని ఆరాధించే హిందూ ధర్మంలో సంప్రదాయానికి విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగేలా కొన్ని పనులు చేస్తున్నాం.
మనం జరుపుకొనే కొన్ని ఉత్సవాలు శబ్ధ, వాయు, జల కాలుష్యాలకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు వినాయక చవితి పండుగను సాంప్రదాయంగా జరుపుకొనేవాళ్లం. ఇప్పుడు ఆకర్షణీయ రంగులతో వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తూ వేడుకలు చేసుకుంటున్నాం. సంప్రదాయం ప్రకారం వినాయకుడి ప్రతిమను ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే మట్టితో తయారుచేసి పూలు, పత్రిలతో భక్తిశ్రద్ధలతో పూజించి.. ఆ తరువాత నీటిలో నిమజ్జనం చేసేవాళ్లం. అంటే ప్రకృతి నుంచి సేకరించిన మట్టితో తయారు చేసిన గణపతిని ఎలాంటి కృత్రిమ మార్పులు లేకుండా తిరిగి ప్రకృతిలో కలపటం జరిగేది.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా భారత ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకురావడానికి బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలతో నవరాత్రి పూజలను ప్రారంభించారు. కాలక్రమేణా మట్టి విగ్రహాల స్థానంలోకి రసాయనిక పదార్థాలతో కూడిన విగ్రహాలు వచ్చి చేరాయి. ఎంత పెద్ద విగ్రహాలు పెడితే అంత గొప్ప అనే సంస్కృతి పెరిగిపోయింది. రంగుల వినాయకులను తయారు చేయడానికి, వాటిని తీర్చిదిద్దడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము, పాదరసం, క్రోమియం, సీసం, కడియం, లెడ్, ఆర్సినిక్ వంటి విషపూరిత రసాయనాలను వినియోగిస్తున్నారు.
ఈ విగ్రహాల నిమజ్జనంతో జలరాశులు మృత్యువాతపడుతున్నాయి. పశువులు అనారోగ్యంపాలవుతున్నాయి. అదేనీటితో పండిన ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాన్సర్, జీర్ణకోశ, చర్మ, కాలేయ సంబంధిత వ్యాదులు వచ్చే అవకాశం ఉన్నది. విగ్రహాల నిమజ్జనం సమయంలో పూడిక చేరి జలాశయాలు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. ప్రతి సంవత్సరం రంగులతో చేసిన వినాయకుల నిమజ్జనం కారణంగా 10వేల టన్నుల రసాయన వ్యర్థాలు భూమిలో చేరుతున్నాయి.
భూమిలో ఉన్న 71 శాతం జలరాశిలో 68 శాతం సముద్ర జలాలే.. 2 శాతం మంచుతో కప్పబడి ఉన్నది. మిగిలిన ఒక శాతం నీటినే తాగడానికి, కాలకృత్యాలకు, వ్యవసాయానికి, భూమిపై ఉన్న సమస్త జీవరాశి అవసరాలకు, పరిశ్రమలకు వాడబడుతున్నది. మిగిలిన ఈ ఒక్క శాతం నీటిని కూడా మనం కలుషితం చేస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లే, కర్రలు, వరిగడ్డి, మట్టితో సులభంగా నీటిలో కరిగిపోయేలా తయారుచేసిన మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో గణనాథులను ప్రతిష్ఠిస్తారు. మట్టి వినాయకుల ప్రతిష్ఠాపనపై ఏటేటా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నా పీవోపీ విగ్రహాలను ప్రతిష్ఠించడం తగ్గలేదు. నిర్వాహకులు ముఖ్యంగా యువత మట్టి వినాయకులను ప్రతిష్ఠించడంపై దృష్టి సారించాలి. వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల, ధారూరు మండలాల్లో మట్టి వినాయకులను తయారు చేసి అమ్ముతుంటారు. బొంరాస్‌పేటలోని భూలక్ష్మీ ఆలయం చౌరస్తాలో పదేండ్ల నుంచి మట్టి గణపతిని ప్రతిష్ఠించి యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. మట్టి వినాయకులనే పూజించాలన్న సంకల్పంతో కోస్గి పట్టణానికి చెందిన గందె ఓం ప్రకాశ్ మట్టి గణనాథులను గ్రామాల్లో పంపిణీ చేస్తుంటాడు. అందరిలో చైతన్యం వస్తేనే మార్పు అనేది ప్రారంభమవుతుంది.
పీవోపీ విగ్రహాలతో పర్యావరణ కాలుష్యం
రానురాను మట్టి గణపతులను మర్చిపోయాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణనాథులను ప్రతిష్ఠిస్తూ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాం. కృత్రిమ రసాయన పదార్థాలతో తయారుచేసిన పీవోపీ గణపతి విగ్రహాలు జల కాలుష్యానికి దారి తీస్తాయి. ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మంచినీరు ఉప్పు నీరుగా మారుతుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన మంచినీటి వ్యవస్థను సమాజం కోల్పోవలసి వస్తున్నది. విగ్రహాల తయారీలో వాడుతున్న రసాయనాలు, రంగులతో నిమజ్జనం చేసిన చెరువు లేదా జల వనరు రంగు కలుషితమవుతున్నది.
ఆ నీరు పంట పొలాల్లో సేద్యపు నీటిగా వాడడం వలన సారవంతమైన పంట భూమిని నిర్జీవంగా మారుస్తుంది. నీటిలో పెరిగే అపారమైన వృక్ష, మత్స్య, జంతు సంపద నశిస్తుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహం 45 నిమిషాల్లో నీటిలో కరిగిపోతుంది, కానీ పీవోపీతో తయారుచేసిన విగ్రహం నీటిలో కరగకుండా కొన్ని నెలలపాటు ఉండిపోతుందని తేలింది. మట్టి గణపతి నీటిలో కరిగిపోతుంది కాబట్టి అదే మట్టిని ఉపయోగించి మరుసటి సంవత్సరం కొత్త విగ్రహాలను తయారు చేసుకోవచ్చు. మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా రీసైక్లింగ్ అనే ప్రకృతి విధానాన్ని మనం పాటించవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్జీవంగా మార్చే ఒక విష పదార్థం. మనిషి జీవితం డబ్బు, ఆర్భాటాలతో ముడిపడిలేదు. గాలి, నీటితోనే ముడిపడి ఉన్నది. కాబట్టి భగవంతుడు మనకు వరంగా ప్రసాదించిన గాలిని, నీటిని, మట్టిని కాపాడుకుందాం. మట్టి గణపతులను పూజిద్దాం.
ప్రజల్లో మార్పు వస్తున్నది
19 ఏండ్లుగా పర్యావరణ పరిరక్షణపై చేస్తున్న పోరాటంతో ప్రజల్లో క్రమంగా మార్పు వస్తున్నది. ప్రతి సంవత్సరం సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు స్వచ్ఛందంగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వంద విగ్రహాలతో మొదలుపెట్టి ఇప్పుడు వెయ్యికి పైగా విగ్రహాలను పంపిణీ చేస్తున్నా.
– రామకృష్ణారావు, పర్యావరణ అవార్డు గ్రహీత