యాచారం, జూన్ 17 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నుంచి ఎర్రమట్టి తరలింపు జోరుగా కొనసాగుతున్నది. మాల్ నుంచి మండలం మీదుగా నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మట్టి టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. వీటిలో నిత్యం టన్నుల కొద్దీ మట్టిని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. రాత్రి, పగలూ అనే తేడా లేకుండామట్టి టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్తున్నా అధికారులు, పోలీసులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
రవాణా చార్జీలను తగ్గించుకునేందుకు ఒక్కో వాహనంలో 40-50టన్నుల ఎర్రమట్టిని తీసుకెళ్తున్నాయి. నిత్యం 100-120 ట్రిప్పులతో పెద్ద సైజు టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులు దెబ్బతింటున్నాయి. మండలంలోని మాల్, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లిగేటు, చింతపట్లగేటు, తక్కళ్లపల్లితండా, నక్కగుట్టతండా, యాచారం, చౌదర్పల్లిగేటు, గున్గల్ తదితర గ్రామాల పరిధిలోని సాగర్ రహదారిపై మట్టి తరలింపు ఓవర్లోడ్తో ముమ్మరంగా
తరలిస్తున్నారు.
అక్కడక్కడ వే బిల్లులను చూయిస్తూ డ్రైవర్లు మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. మట్టి తరలింపునకు మైనింగ్, ఇరిగేషన్ అనుమతులు ఉన్నాయో లేదో అని చూడకుండానే అధికారులు వాహనాలను వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో వందలాది టిప్పర్లు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా సంబంధిత రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొంత మంది అధికారులు కాంట్రక్టర్ల ద్వారా ముడుపులు తీసుకొని ఓవర్లోడ్ టిప్పర్లను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాహనాలను ఆపి ఆందోళన చేసేందుకు మండల ప్రజాప్రతినిధులు సిద్ధం
అవుతున్నారు.
ఇప్పటికే అదిబట్ల, ఇబ్రహీంపట్నం, యాచారంలో పలుమార్లు పోలీసులు టిప్పర్లను పట్టుకున్నప్పటికీ మట్టి దందా మాత్రం ఆగడంలేదు. టిప్పర్లు ఓవర్లోడ్ మట్టితో వెళ్లడంతో రోడ్డుపైనా మట్టి పెళ్లలు రాలిపడుతున్నాయి. దీంతో వాటి వెనకాల నుంచి వెళ్లే వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మట్టిపెళ్లలు ఎప్పుడు ఎవరిమీద పడుతాయోననే ఆందోళన వ్యకం చేస్తున్నారు. వీటి ద్వారా తరలిస్తున్న ఎర్రమట్టి నుంచి వచ్చే దుమ్ముతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ద్విచక్ర వాహనదారుల కండ్లల్లో దుమ్ము పడుతుండడంతో పలు అవస్థలు పడుతున్నారు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలించడంతో.. అటు ఇటుకల వ్యాపారం, ఇటు మట్టిదందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. కానీ ఓవర్లోడ్ వాహనాలతో రోడ్లు ఒక్కసారిగా దెబ్బతింటున్నాయి. పైగా నిత్యం రహదారిపై రాకపోకలు సాగించే పెద్ద సైజు టిప్పర్లు యముడిని తలపిస్తున్నాయి. వేగంగా వెళ్తున్న టిప్పర్లతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు, ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యాచారం మీదుగా సాగర్ రహదారిపై ఓవర్లోడుతో వెళ్తున్న వాహనాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చింతపల్లి నుంచి ఎర్ర మట్టి తరలిస్తున్న మట్టి టిప్పర్లపై పోలీసులు, ఆర్అండ్బీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఓవర్లోడ్తో టన్నుల కొద్దీ మట్టిని తరలించడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. వీటి నుంచి మట్టి కింద పడుతుండడంతో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేస్తాం.
– భూతరాజు నాగరాజు, మాజీ వార్డు సభ్యుడు, యాచారం