ఉమ్మడి రాష్ర్టాన్ని విభజిస్తే తెలంగాణ చీకటవుతుందని సమైక్య పాలకులు అక్కసు వెళ్ల గక్కారు. వారి అంచనాలను తిప్పికొడుతూ రాష్ట్రం సిద్ధించాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వ్యవసాయం, పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది. దీనికితోడు సాగు నీటి కోసం ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం, ‘మిషన్ కాకతీయ’తో చెరువులను పునరుద్ధరించడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,17,717 వ్యవసాయ కనెక్షన్లకు నిరంతర విద్యుత్తు సరఫరా అవుతున్నది. 24 గంటల విద్యుత్తు సరఫరాతో పారిశ్రామిక రంగంలోనూ నవశకం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఇదివరకు ఉన్న పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు ఎన్నో వచ్చాయి. పవర్ ప్రాబ్లమ్ లేనికారణంగా మూడు షిప్టులు పని చేస్తుండడంతో ఉత్పత్తులు పెరిగాయి. దీంతో పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలువడం గమనార్హం.
– రంగారెడ్డి, ఆగస్టు 19 (నమస్తేతెలంగాణ)

రంగారెడ్డి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ ఆవిర్భవించిన 2014 జూన్ నాటికి విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం. గాలి వీచినా.. చిన్నపాటి వర్షం కురిసినా.. రోజుల తరబడిగా కరెంటు ఉండేది కాదు. పట్టణాల్లో నిత్యం 6 గంటలు కోతలు ఉండగా.. గ్రామాల్లో రోజంతా కరెంట్ ఉండేది కాదు. వ్యవసాయానికి పేరుకే 6 గంటల విద్యుత్. కానీ.. 4 గంటల విద్యుత్ కూడా సరఫరా ఉండేది కాదు. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఇష్టం వచ్చినప్పుడు సరఫరా చేసేవారు. కరెంటు కోతల నేపథ్యంలో పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలిడేగా ప్రకటించుకునే సందర్భాలు ఉండేవి.

నాటి పరిశ్రమల దుస్థితి..
నాడు కరెంట్ కోతలతో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా కుదేలైంది. కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. విద్యుత్తు సరఫరా సరిగ్గా లేకపోవడంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా కంపెనీలను మూసివేసిన పరిస్థితులుండేవి. వేసవికాలం వచ్చిందంటే పరిశ్రమలు పవర్ హాలీడేలు ప్రకటించేవి. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడేవారు. ఉత్పత్తులు తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ క్షీణించి కొన్ని కంపెనీలు పూర్తిగా మూతపడిన సందర్భాలూ ఉన్నాయి.

నాడు కరెంటు కోతతో సాగు సాగకు..
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు సంక్షోభం ఉండేది. గాలి వీచినా.. చిన్నపాటి వర్షం కురిసినా.. రోజుల తరబడి కరెంటు ఉండేది కాదు. పట్టణాల్లో 6 గంటలు, పల్లెల్లో రోజంతా కరెంట్ కోతలే. వ్యవసాయానికి పేరుకే 6 గంటల విద్యుత్తు.. కానీ ఇచ్చేది 4 గంటలే.. అదికూడా పగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటల కరెంట్‌తో ఎకరం పొలం పారని పరిస్థితి. రైతన్నలు పడిగాపులు కాసేవారు. రాత్రిళ్లు ప్రమాదాలకు గురై మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. దీనికితోడు వేళాపాళాలేని కరెంట్ వల్ల ట్రాన్స్ఫార్మర్లతో పాటు వ్యవసాయ మోటర్లు కాలిపోయేవి. ఎండిన పంటను చూసి రైతన్నలు కన్నీళ్లు పెట్టుకునేవారు.
నేడు నిరంతర వెలుగులు..
విద్యుత్ విషయంలో సమైక్యవాదులు సృష్టించిన భయాందోళనలను చెల్లాచెదురు చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి తక్కువ వ్యవధిలోనే ప్రగతి సాధించారు. ఫలితంగా 2014 నవంబర్ నాటికే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కోతల్లేని విద్యుత్‌ను అందించగలిగారు. 2018 జనవరి నాటికి నిరంతర విద్యుత్‌ను, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటును అందించి తెలంగాణను అగ్రభాగంలో నిలబెట్టారు. పల్లె, పట్టణ ప్రగతిలో కొత్తలైన్లు, స్తంభాలను ఏర్పాటు చేసి నిరంతర వెలుగులతో విద్యుత్ సమస్యలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు.
స్వరాష్ట్రంలో తీరిన కష్టాలు..
సమైక్య పాలనలో కరెంటు విషయంలో ప్రజానీకం అరిగోస పడింది. తెగిపడిపోయిన విద్యుత్ లైన్లు.. తరచుగా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లతో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక అనేక కష్టాలు అనుభవించారు. వేళాపాళాలేని విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్లు కార్చారు. ప్రజానీకం సైతం రోజుల తరబడిగా అంధకారంలోనే మగ్గే పరిస్థితులు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారింది. పొరుగున ఉన్న రాష్ర్టాలు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో చతికిలపడిపోయాయి. కర్ణాటకలో ఇటీవల అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ విషయంలో చతికిల పడిపోయింది. కానీ..సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు. గతంలో కంటే విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ కరెంటు కోతలు మాత్రం లేవు. గతంలో కుదేలైన పారిశ్రామిక రంగం ప్రభుత్వం ఇస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా పుంజుకున్నది.
జిల్లాలో ప్రస్తుతం 1,358 పరిశ్రమలకు నిరంతరాయంగా అందుతోంది. చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమలు నిరంతర కరెంటు సరఫరాతో విస్తారంగా ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమల్లో గతంలో ఒకే షిప్టుల్లో పనిచేసే అవకాశం కలగగా.. నేడు మూడు షిప్టుల్లో పని జరుగుతున్నది. అందులో పనిచేసే కార్మికులకు సైతం ఉపాధి పుష్కలంగా దొరుకుతున్నది. జిల్లాలో రోజువారీ సగటు విద్యుత్ వాడకం 21.46మి.యూ. ఉండగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ 784.73మెగావాట్లు ఉంటున్నది. ప్రభుత్వ చర్యల ఫలితంగా బోర్లు, బావుల కింద పంటల సాగు పెరుగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేండ్లుగా అధిక మొత్తంలో పంట ఉత్పత్తులను సాధిస్తున్నామని సగర్వంగా చెబుతున్నారు. ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో అందిస్తున్న నాణ్యమైన విద్యుత్ పట్ల సబ్బండ వర్గాల ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
సాగుకు 24 గంటల కరెంట్ :
రాష్ట్రం ఏర్పడేనాటికి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. ఇప్పుడు వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణే. జిల్లాలో ప్రస్తుతం 1,17,717 కనెక్షన్లు ఉండగా ఆయా రైతులకు ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా పూర్తి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.
ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు..
ప్రభుత్వం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రతినెలా 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తున్నది. ఇందుకుగాను ఇప్పటివరకు ప్రభుత్వం 22.98కోట్లను వెచ్చించింది. నాయీ బ్రాహ్మణులు, రజకులు నిర్వహిస్తున్న క్షౌరశాలలు, లాండ్రి షాపులకు సైతం ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నది. దీంతో జిల్లాలో 1,242 మంది నాయీ బ్రాహ్మణులు, 5,405 మంది రజకులు ఉచిత విద్యుత్తుతో లబ్ధిపొందుతున్నారు. 2015 సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రతి యూనిట్‌కూ రెండు రూపాయల చొప్పున పవర్‌లూమ్స్, పౌల్ట్రీ ఫాంలకు సరఫరా చేసే విద్యుత్‌పై సబ్సిడీని అందజేస్తున్నది.
తొమ్మిదేండ్లుగా…
వికారాబాద్, ఆగస్టు 19,(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ చీకటి అవుతుందని అక్కసు వెల్లగక్కిన సమైక్య పాలకుల వ్యాఖ్యాలకు దీటుగా తొమ్మిదేండ్లుగా తెలంగాణ అంతటా నిరంతర కరెంట్ సరఫరా అవుతున్నది. నాడు గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు ఎక్కడ చూసినా కరెంట్ కోతలుండగా.. నేడు గృహ అవసరాలతోపాటు వ్యవసాయం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాతో వెలుగులు విరజిమ్ముతుండడం విశేషం. రైతులకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలుత ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి పగలు 6 గంటలు, రాత్రి సమయంలో 3 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయించి అమలు చేసింది. తదనంతరం రాత్రి పూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లే రైతుల సంక్షేమం కోసం పగటిపూటనే తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేసింది.

2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన ప్రభుత్వం…2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 4.80 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయా పంటల విస్తీర్ణం ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకుపైగా పెరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో కరెంట్ కోతలతో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా కుదేలైంది. నాడు పగలు రెండు గంటలపాటు, రాత్రికి రెండు గంటలపాటు అధికారికంగా పరిశ్రమలకు పవర్ కట్ చేసేవారు. కానీ అనధికారికంగా రోజుకు ఆరేడు గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిపివేసేవారు. గతంలో విద్యుత్తు సరఫరా సరిగ్గా లేకపోవడంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి తమ కంపెనీలను మూత వేసుకోవాల్సిన పరిస్థితులుండేవి. వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా పరిశ్రమలు పవర్ హాలీడేలు ప్రకటించేవి. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడేవారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ కట్కు రోజులు పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకుగాను పరిశ్రమలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది.
24 గంటల కరెంట్ సంతోషకరం..
తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. దీంతో రోజంతా ఇస్త్రీ చేసుకొని జీవనం కొనసాగిస్తున్నం. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లేక వచ్చిన బట్టలను ఇస్త్రీ చేయలేక ఎంతో ఇబ్బంది పడ్డాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కరెంట్ ఇవ్వడంతో రోజంతా బట్టలు ఐరన్ చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాం.
– వెంకట్, చేవెళ్ల
మంచి కూలీ వస్తున్నది
మా ప్రాంతంలో ఉపాధి లేకపోవడంతో తాండూరుకు వచ్చి నాపరాతి పాలిషింగ్ మిషన్లలో పనులు చేసుకుంటున్నా. ఇక్కడ 24 గంటల కరెంటు ఉండడంతో రోజుకు 12 నుంచి 16 గంటలు పనులు చేసుకుంటూ రోజుకు రూ.900 నుంచి రూ.1200 సంపాదిస్తున్నా. నాపరాళ్ల యూనిట్లో పనిచేస్తూనే పిల్లలను చదివిస్తున్నా. ఇక్కడున్నట్లు మా ప్రాంతంలో పనులు లేవు. తాండూరు మాకు మంచిగా ఉపాధిని కల్పించడంతోనే ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా ఉంటున్నాం. తాండూరులో నాపరాతి పరిశ్రమలు ఆగకుండా పనులు వేగంగా జరుగుతున్నాయి. నిరంతర విద్యుత్ ఇస్తున్న తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు.
– రంగస్వామి, కర్నూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
సాఫీగా వ్యవసాయం చేస్తున్నా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరైన వసతులు లేక పంటలు పండకపోవడంతో వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మాటిమాటికి కరెంటు కోతలు విధించడంతో పంటలు సరిగా పండేవి కావు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల విద్యుత్, సాగు నీరు, వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందడంతో యాలాల మండలం విశ్వనాథ్పూర్లో 10 ఎకరాల్లో వరి, అరటితోట, పెసరు, మినుము, కందితో పాటు కూరగాయల పంటలు పండిస్తూ వ్యవసాయం చేస్తున్నా.
– నిజామబాద్ కేశవరావు, విశ్వనాథ్‌పూర్, యాలాల మండలం
ఉపాధికి ఢోకా లేదు
గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలతో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఎండకాలమైతే మరీ ఇబ్బందయ్యేది. ఇంట్ల కరెంటుతోటి అవసరమైన పనులు చేసుకునేందుకు కష్టమయ్యేది. కరెంటు ఎప్పుడొస్తదో అని ఎదురుచూసేటోళ్లం. కరెంటు వచ్చినప్పుడే అన్ని పనులు చేసుకునే పరిస్థితి ఉండె. కానీ, బీఆర్ఎస్ సర్కారు వచ్చినంక ఆ సమస్యే లేదు. కరెంటు కోతల్లేవు. సర్కారు మాకు ఉచితంగా కరెంటు ఇస్తున్నది. కులవృత్తి ఇస్త్రీ చేసుకుని ఉపాధి పొందుతున్నా. ఒకప్పుడు బొగ్గుల పెట్టెతోటి ఇస్త్రీ చేసేవాళ్లం. వర్షాకాలం చాలా ఇబ్బంది అయ్యేది. కానీ, ఇప్పుడా కష్టాలేవీ లేవు. రోజంతా కరెంటు ఉంటుంది. మాకు ఉచిత విద్యుత్ మీటర్ ఉన్నది. అందుకే పెట్టుబడికి ఇబ్బందే లేదు. కోతల్లేని కరెంటు ఇస్తున్న సర్కారుకు రుణపడి ఉంటాం.
– అక్కనపల్లి ఆండాళు, పెద్దఅంబర్‌పేట
24 గంటల కరెంట్ హర్షణీయం
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేటోళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హాయిగా వేసవిలోనూ నిరంతర విద్యుత్ సరఫరాతో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. కర్ణాటకలో ప్రజలు ప్రస్తుతం విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి, ఇటు గృహావసరాలకు 24 గంటల కరెంట్ ఇస్తుండడం హర్షణీయం.
– ఎదిరె లక్ష్మి, గృహిణి, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల మండలం
సాఫీగా పనులు..
గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో కరెంటుకోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కరెంటులేక ఉపాధిని కోల్పోయేవాళ్లం. తెలంగాణ సాధించి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 24గంటల కరెంటు వస్తుంది. దీంతో నష్టాల్లో ఉన్న తాము, లాభాల బాటలో ఉన్నాం. చేతినిండా పనిదొరుతుండడంతో ఆర్థికంగా బలపడి మా కుటుంబం సంతోషంగా ఉంది. అనేక చేతివృత్తుల వారు 24గంటల విద్యుత్ వస్తుండటంతో సాఫీగా పనులు చేసుకుంటున్నారు.
– వెంకటాచారి, ఇబ్రహీంపట్నం (వడ్రంగి)
బీఆర్ఎస్తోనే 24గంటల విద్యుత్తు
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఎప్పుడు వస్తుందో… ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. పంటలకు నీరు పెట్టేందుకు బోరుబావుల వద్ద రాత్రి, పగలు కాపలా కాసేవాళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్సారు 24గంటల కరెంటు ఇస్తుండు. దీంతో పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. రైతుల కష్టాలు పట్టని కాంగ్రెస్ వస్తే కష్టాలు తప్పవు. బీఆర్ఎస్తోనే 24గంటల విద్యుత్ సరఫరా సాధ్యం.
– పెద్దొళ్ల మల్లయ్య, రైతు (ఇబ్రహీంపట్నం)
నిరంతరాయంగా విద్యుత్తు
అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదు.. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తు సరఫరా చెయ్యకపోవడంతో పంటలెండిపోయి, రైతన్నలు పడ్డపాట్లు అన్ని ఇన్నికావు, జనజీవితంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు అనివార్యమైపోయాయి.. పదేపదే మోటర్లు కాలిపోతుండేవి.. రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు.
-కృష్ణగౌడ్, రైతు కోటమర్పల్లి, మర్పల్లి మండలం
మూడు పంటలు పండుతున్నాయి..
రాష్టంలో రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. గత ప్రభుత్వాల పాలనలో చాలీచాలని కరెంట్‌తో వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి సమయానికి కరెంట్ లేక పంటలకు నీరు అందించలేక రైతులు ఆర్థికంగా నష్టపోయేవారు. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని భూగర్భ జలాలు పెరిగేందుకు మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పూడిక చేపట్టారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో సమయానికి పంటలకు నీరు అందిస్తుండడంతో సంవత్సరానికి మూడు పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం.
– గొల్ల రామయ్య, టేకులపల్లి
చేతినిండా పని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 24గంటల నాణ్యమైన విద్యుత్‌తో చేతినిండా పని దొరుకుతుంది. గత 15సంవత్సరాలుగా వడ్రంగి పనిపై ఆధారపడి పని చేస్తూ జీవనం సాగిస్తున్న. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందనే తెలియని పరిస్థితి ఉండేది. విద్యుత్ సరిగ్గాలేక రోజంతా పని ఉన్నా చేయలేని పరిస్థితితో ఖాళీగా కూర్చునేది. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న మాకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-రమాకాంత్చారి, వడ్రంగి తలకొండపల్లి
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇస్తుండు. గత ప్రభుత్వాల పాలనలో రైతులకు రాత్రి పూట మాత్రమే ఇచ్చేవారు. రాత్రుళ్లు పొలాలకు నీళ్లు పెట్టాడానికి వెళ్లి స్టార్టర్ల వద్ద కరెంట్ షాక్ తగిలి, పాము కాట్లకు గురై ఎంతోమంది రైతులు చనిపోయిన ఘటనలు కోకోల్లలు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి కాబట్టి రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు.
– కైలాష్, కొండకల్, శంకర్పల్లి మండలం
పౌల్ట్రీ రంగానికి మంచి రోజులు…
నేను కడ్తాల్ గ్రామంలో 13 సంవత్సరాలుగా 25 వేల సామర్థ్యం గల కోళ్ల పరిశ్రమను నిర్వహిస్తున్నాను. వ్యవసాయంతోపాటు పౌల్ట్రీ రంగానికి 24 కరెంట్ సరఫరా అవుతుండటంతో ఎంతో మేలు కలుగుతుంది. 2014కి ముందు కోళ్ల ఫాంలకు త్రీఫేజ్ కరెంట్ కేవలం మూడు, నాలుగు గంటలు మాత్రమే సరఫరా అయ్యేది. ఆ కొద్ది సమయంలోనే కోళ్లకి దాణా తయారు చేయడం, నీళ్లు అందించడం తదితర పనులు చేసుకునే వాళ్లం. ఒక్కోసారి కోళ్లకు సరిపడా దాణా లేకపోవడంతో కోడి గుడ్ల ఉత్పత్తి తగ్గేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి అన్ని విధాలు మేలు జరుగుతుంది.
-నేతి వినోద్‌కుమార్, పౌల్ట్రీ యజమాని, కడ్తాల్ మండలం
సాగు విస్తీర్ణం పెరిగింది
గత ఉమ్మడి పాలనలో విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడెవాళ్లం. రాత్రి సమయంలోనే విద్యుత్ వచ్చేది. దీంతో అక్కడే భయంతో నిద్రపోయేవాళ్లం. తెలంగాణ వస్తే విద్యుత్ లేక అంధకారంగా మారుతుందని గత ప్రభుత్వాల నాయకులు తెలంగాణపై విషం కక్కారు.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాకే.. 24 గంటల విద్యుత్ వస్తుంది. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది. 24 గంటల విద్యుత్ సరాఫరా అవుతుండటంతో మా కష్టాలు తీరాయి.
-వెంకట్‌రెడ్డి, రైతు, ఎలికట్ట, ఫరుఖ్‌నగర్ మండలం
