వికారాబాద్, మార్చి 1 : దివ్యాంగులకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ సూచించారు. శనివారం సద రం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు లు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కలెక్టర్లు, డీఆర్డీవో, డీడబ్ల్యూవో, డీసీహెచ్ఎస్, జిల్లా ఆ స్పత్రి సూపరింటెండెంట్లతో సెర్ప్ సీఈవో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు.
గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, వీఎల్ఈ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యూడీఐడీ పోర్టల్, సొంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్లు బుక్ చేసుకోవచ్చని సెర్ప్ సీఈవో తెలిపారు. క్యాంపుల వివరాలు మెసేజ్ ద్వారా తెలియజేయనున్నట్లు సూచించారు. ఈ ప్రక్రియను ఈ ఏడాది మార్చి నుంచి అమల్లోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. 21 రకాల వైకల్యం కలిగిన వారు యూడీఐడీ (యూనిక్ డిజాబిలిటీ ఐడీ) కార్డును పొందవచ్చని ఆమె తెలిపారు. సదరం కార్డును కూడా పోస్టల్ ద్వారా అభ్యర్థులకు చేరవేయనున్నట్లు తెలిపారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి ప్రస్తుతం ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో సదరం క్యాంపులను నిర్వహించేందుకు 38 మెడికల్ బోర్డులను గుర్తించామని సెర్ప్ సీఈవో తెలిపారు. సదరం క్యాంప్ నిర్వహించే సందర్భాల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై మీసేవ నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. పీఎం కుసుం ప్రా జెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలన్నారు. ఆసక్తి ఉన్న వారి నుం చి దరఖాస్తులను స్వీకరించి స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఉమా హారతి, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామచంద్రయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.