Keesara- RTC | కీసర, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు జాతర పేరిట స్పెషల్ ఆర్టీసీ జాతర బస్సులను నడుపుతామని సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం దేవస్థానం అధికారులు, జిల్లా అధికారులతో చర్చించేందుకు టీజీఎస్ఆర్టీసీ నుంచి సికింద్రాబాద్ ఆర్ఎం రాజశేఖర్, డీప్యూటీ ఆర్ఎం శ్రీనివాస్, డివిజనల్ ఆర్ఎం భీమ్‌రెడ్డి, కుషాయిగూడ డిపో మేనేజర్ మహేశ్, కంటోన్మెంట్, హాకీంపేట్, ఉప్పల్, చంగిచెర్ల డిపోల మేనేజర్లు కీసరగుట్టకు వచ్చారు. మహాశివరాత్రి కోసం వచ్చే భక్తులు భారీగా కీసరకు రానున్న నేపథ్యంలో వారు ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి జాతర ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆర్ఎం రాజశేఖర్ మాట్లాడుతూ కీసరగుట్టలోని బస్టాండ్‌ను చక్కగా ముస్తాబు చేయాలని సూచించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి జాతర స్పెషల్ బస్సులను నడుపుతామన్నారు. 24 నుంచి వచ్చే నెల మార్చి ఒకటో తేదీ వరకు కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వరకు జాతర పేరిట స్పెషల్ జాతర బస్సులను నడిపిస్తారు. ప్రతి బస్సు కీసరగుట్టలో ఉన్న బస్టాండ్‌కు వచ్చి వెళుతుంది.